Jun 24,2023 21:18

వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న నాయకులు

మదనపల్లె అర్బన్‌ : రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన నిర్వహిస్తున్న చలో విజయవాడ కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విఠలం వెంకట రమణారెడ్డి, సిరిపురం రామచంద్ర పిలుపునిచ్చారు. శనివారం స్థానిక మార్కెట్‌ యార్డులో చలో విజయవాడ వాల్‌పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని రైతులను ఆర్థికంగా ఆదుకో వాలని 30న విజయవాడలోని ధర్నాచౌక్‌ వద్ద నిర్వహిస్తున్న బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. అతివష్టి, అనావష్టి వర్షాల వల్ల రైతులు పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయారన్నారు. రైతులు కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతాంగం తీవ్రంగా నష్టపో తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగ ఉద్యమానికి తలవంచి బిజెపి ప్రభుత్వం రైతు వ్యతిరేక వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేసినా రైతాం గానికి ఇచ్చిన హామీలను మాత్రం అమలు చేయకుండా మోసగించిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరల గ్యారెంటీ చట్టం వెంటనే తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. అన్ని పంటలకు కనీస ధరలు కల్పించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు. జిల్లాలోని రైతులకు పంట నష్టపరిహారం, ఇన్సూరెన్స్‌ ఇవ్వాలన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల బిగింపు వెంటనే ఆపాలన్నారు. ఉద్యాన పంటలు రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీ బకాయిలు, పాడి రైతులకు బోనస్‌ లీటరకు రూ.4 ఇవ్వాలన్నారు. వ్యవసాయ పరికరాలు, డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాలు సబ్సిడీపై ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కౌలు రైతులకు పంట సాగు ద్వారా హక్కు పత్రాలు ఇచ్చి వడ్డీ లేని పంట రుణాలు, నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. భూ నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం న్యాయమైన పరిహారం అందించాలన్నారు. జిల్లాలో వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి మొక్కజొన్న కొనుగోలు చేయాలని కోరారు. అన్ని పంటలకు పంటల బీమా పథకం వర్తింపజేయాలని, గ్రామాల ప్రాతిపదికన పంటల బీమా పరిహారం అందించాలన్నారు. కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.