ప్రజాశక్తి ధర్మవరం టౌన్ : అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను అన్ని విధాల ఆదుకోవాలని, అదేవిధంగా కేరళ తరహాలో రుణవిముక్తి కల్పించాలని ఏపీ రైతుసంఘం జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీ రైతుసంఘం ఆధ్వర్యంలో నాయకులు, రైతులు శుక్రవారం స్థానిక కళాజ్యోతి సర్కిల్లో రోడ్డుపై మోకాళ్లపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జంగాలపల్లి పెద్దన్న మాట్లాడుతూ పంటలు సక్రమంగా పండక, పండిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలనే ఆలోచన కూడా చేయలేదన్నారు. పేరుకే రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు. రైతులకు సంబంధించి అన్ని రకాలరుణాలను మాఫీ చేయాలని, మోటార్లకు మీటర్లు బిగించే విధానాన్ని ప్రభుత్వం వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదించిన సిఫారసులను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం జిల్లానాయకులు పోతలయ్య, మండల అధ్యక్షులు కొత్తపేట మారుతి, ఏపీ చేనేత కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షులు పోలా రామాంజినేయులు, సీపీఎం నాయకులు ఎస్‌హెచ్ బాషా, సిఐటియు నాయకులు ఎల్ ఆదినారాయణ, చేనేత నాయకులు లక్ష్మీనారాయణ, రైతుసంఘం నాయకులు రేగాటిపల్లిరవి, వెంకటస్వామి, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.










