
ప్రజాశక్తి - కదిరి టౌన్ : రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం చెందిందని రైతు సంఘం జిల్లా కార్యదర్శి బడా సుబ్బిరెడ్డి విమర్శించారు. కదిరి పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయ పద్ధతిలో పరిశీలించి శ్రీ సత్య సాయి జిల్లాలో ఉన్న 32 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఎక్కువ మంది రైతులు ఖరీఫ్ లో వేరుశెనగ, కంది ఇతర పంటలు సాగు చేసారని సకాలంలో వర్షాలు లేక పంటలు ఎండిపోయయని అన్నారు. దిగుబడి లేక పెట్టిన పెట్టుబడి రాక రైతు కుటుంబాలు అప్పుల్లో కూరుకు పోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. పంట పెట్టి నష్టపోయిన రైతులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ప్రతి ఎకరానికి 40 వేల రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలన్నారు. ఖరీఫ్‌లో పంటసాగు కోసం భూమి చదును చేసుకొని విత్తనాలు, ఎరువులు కొని సకాలంలో వర్షం లేక పంట పెట్టలేని రైతులకు ఎకరానికి 25 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూగర్భ జలాలు అడుగంటి పోవడం వల్ల బోర్లు, బావులు కింద సాగుచేసిన పండ్ల తోటలు, కూరగాయలు సాగు చేసి నష్టపోయిన రైతులకు ఎకరానికి 50వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. అన్ని రకాల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఈశ్వర్ రెడ్డి, గంగిరెడ్డి, లక్ష్మానాయక్, రామాసి నాయక్ పాల్గొన్నారు.