ప్రజాశక్తి - ఆదోని
కరువు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని టిడిపి నాయకులు మండిపడ్డారు. బుధవారం మండలంలోని పంట పొలాలను పరిశీలించి, ఎండిపోయిన పంటను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు మాన్వి దేవేంద్రప్ప, మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ సూరం భాస్కర్ రెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ కేవలం బటన్ నొక్కడానికి పరిమితమయ్యారని తెలిపారు. ఎమ్మెల్యేలు, మంత్రులు గడపగడపకు తిరగడం కాదని, పొలం బాట పట్టి రైతుల కష్టాలు తెలుసుకొని ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతవారం ఎమ్మిగనూరులో పర్యటించినా, గతనెలలో డోన్, పత్తికొండ నియోజకవర్గాల్లో పర్యటించినా రైతుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. పంటలు ఎండిపోతున్న పట్టించుకోలేదన్నారు. గతేడాది రైతులు పూర్తిగా నష్టపోయినా మండలంలో పంట నష్టపరిహారం ఇవ్వలేదని తెలిపారు. పెద్దహరివాణం గ్రామంలో ఉల్లి సాగు చేయకపోయినా 50 మంది రైతులకు ప్రభుత్వం పరిహారం ఇచ్చిందని చెప్పారు. ఈ ఏడాది అయినా పంట పొలాలను పరిశీలించి నివేదికలు తయారు చేయాలని, నష్టపోయిన ప్రతి రైతుకూ ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా పశ్చిమ ప్రాంతంలోని ఆదోని డివిజన్‌లో తీవ్ర కరువు ఏర్పడినా, రైతులు వలస బాట పడుతున్నా మంత్రులు బుగ్గన రాజేంద్ర నాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరామ్ ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మంత్రి గుమ్మనూరు నియోజవర్గంలో రైతులు పూర్తిగా నష్టపోయారని, మంత్రి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తుంగభద్ర దిగువ కాలువకు డ్యాం నుంచి నీటి వాటా రాకపోయినా జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు నోరు మెదపడం లేదన్నారు. ఈఏడాది ఆగస్టు 10న రాష్ట్ర మంత్రులు గుమ్మనూరు జయరామ్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు తుంగభద్ర డ్యామ్‌లో బస చేసినా ఆంధ్రాకు జరుగుతున్న అన్యాయంపై బోర్డు అధికారులతో చర్చించలేదని తెలిపారు. కేవలం బోర్డు పరిధిలో జరుగుతున్న పనుల పర్సెంటేజీలకే మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్లారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఆంధ్రాకు రావాల్సిన 650 క్యూసెక్కుల నీటి వాటాను సాధించాలని డిమాండ్ చేశారు. నవంబర్ 30కి తుంగభద్ర దిగువ కాలువకు నీటి సరఫరా నిలిపివేస్తామని బోర్డు అధికారులు ప్రకటిస్తే, దానిపై నోరు మెదపని పాలకులు అవసరమా అని ప్రశ్నించారు. జనవరి వరకు ఎల్‌ఎల్‌సికి సాగునీరు సాధించాలని, ఎండిపోతున్న మిరప, వరి, పత్తి పంటలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. మాజీ కౌన్సిలర్ రామచంద్ర, సోమశేఖర్ రెడ్డి, మల్లికార్జున, మద్దికెర రామకృష్ణ, కనే జగదీష్, నానాపురం షాషావలీ, జి.ఇస్మాయిల్ పాల్గొన్నారు.
పంట పొలాలను పరిశీలిస్తున్న నాయకులు










