- పండిన ప్రతీ గింజా కొనుగోలు చేస్తాం
- ఎపి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వీరభద్రారెడ్డి
ప్రజాశక్తి - కాకినాడ
ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్ర రెడ్డి అన్నారు. శనివారం జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దాళ్వా సాగు చేతికందే సమయంలో అకాల వర్షాలు కారణంగా రైతుల తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఆర్బికేలు ద్వారా ప్రతి గింజ కొనుగోలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి ప్రత్యేక అధికారిని కూడా నియమించినట్టు తెలిపారు. ఆర్‌బికెల నుండి కొనుగోలు చేసిన ధాన్యాలు చెల్లింపులకు సంబంధించి ఒకటి నాలుగు నిష్పత్తి బ్యాంకు గ్యారంటీ సౌకర్యం రైస్ మిల్లర్లకు కలిగించినట్టు తెలిపారు. ప్యాడీ కి సంబంధించి తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడానికి అలాగే బాయిల్డ్ రైస్ సంబంధించి ఐదు లక్షల టన్నులకు కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఆర్‌బికెల ద్వారా స్వీకరించిన ధాన్యం తిరిగి లెవీ రూపంలో ప్రభుత్వానికి అందజేయడంలో మన రాష్ట్రం ముందంజలో ఉందని తెలిపారు. సరిహద్దు రాష్ట్రం తెలంగాణలో 50 లక్షల టన్నులు బకాయిలు ఉన్నాయని వాటితో పోలిస్తే మన రాష్ట్రంలో సేకరించిన ప్రతి గింజ సద్వినియోగం చేయడం జరుగుతుందని తెలిపారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటుచేసిన ఈ కొత్త వ్యవస్థ ద్వారా రైతులు ఎవరూ మిల్లర్లను సంప్రదిం చాల్సిన అవసరం లేకుండా నేరుగా తమ ధాన్యాన్ని ఆర్ బి కే లకు అమ్ముకునే అవకాశం ఉందని అలాగే దళారీలను ఆశ్రయించొద్దని సూచించారు. దళారీ వ్యవస్థ పూర్తిస్థాయిలో నిర్మూలన చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో కోనసీమ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధక్షుడు వేగుళ్ళ పట్టాభి రామయ్య చౌదరి, తూర్పుగోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్లమిల్లి బుల్లి మోహన రెడ్డి తదితరులు ఉన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న వీరభద్రారెడ్డి










