ప్రజాశక్తి-యస్.రాయవరం:ఇటీవల సంభవించిన మాండూస్ తుఫాన్‌తో అనకాపల్లి జిల్లాలో పంటలు దెబ్బతిన రైతులకు పరిహారం చెల్లించాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలరాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.సత్యనారాయణలు డిమాండ్ చేశారు. తిమ్మాపురం సచివాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, ఈ తుఫాను కారణంగా రైతులకు చేతికి అందివచ్చిన వరి పంట నీట మునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులను గ్రామాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతీ రైతు వరి పంటను పరిశీలించి పంట నష్టం జరిగినా నమోదు చేసి తక్షణమే నష్టపరిహారం అందించాలని కోరారు.వరి పంట కోసిన పనలు నీటి మునిగిన నష్టం జరిగితే నష్టపరిహారం చెల్లించడానికి అవకాశం లేదని వ్యవసాయ శాఖ అధికారులు ప్రకటించడం సరికాదన్నారు. దీంతో రైతులు ఎంతో ఆందోళన చెందుతున్నారని, ఈ నిబంధన రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో వరి పంట కోసిన తరువాత తుఫాన్ ప్రభావానికి నీటి మునిగిన ధాన్యం తడిచి నానిపోయాయన్నారు. అనేక ప్రాంతాల్లో మొలకలు రావడం, రంగు మారడం జరిగిందన్నారు.దీనిని కూడా పరిగణనలోకి తీసుకుని నష్టపరిహారం చెల్లించాలన్నారు.ప్రస్తుతం వరి బాగా పండిపోయి కోతలు సమయం దాటి పోవడంతో కోస్తుంటే గింజలు రాలిపోతున్నాయని, ఈ విధంగా కూడా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. అనేక ప్రాంతాలలో వరి చేను కింద పడి నీటిలో మునిగిపోయిందని, దీంతో వరి గింజలు రంగు బాగా మారి, మొలకలు కూడా వచ్చాయన్నారు. 33 శాతానికి పైగా పంటకు నష్టం జరిగితేనే నష్టపరిహారం చెల్లిస్తామని వ్యవసాయ శాఖ అధికారులు ప్రకటించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. పంట ఏ స్థాయిలో ఎంత నష్టం జరిగినా నమోదు చేసి నష్ట పరిహారం చెల్లించాలని కోరారు. వరి సాగు, కౌలు రైతులకు ఎకరాకు రూ.25 వేలు నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం విలేజ్ రెవెన్యూ అధికారి నూకరాజుకి వినతి పత్రం అందజేశారు. జిల్లా కలెక్టర్‌కు స్పందనలో అధికారుల నిర్లక్ష్యం పై ఫిర్యాదు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మామిడి నానాజీ, పిక్కి రాజు, తుమ్ము శంకర్రావు, కురందాసు అప్పలరాజు, మాదాసు విష్ణు, తుమ్ము పద్మ,
తదితరులు పాల్గొన్నారు.










