Oct 30,2023 01:25
చాకిరాలలో ఎండిపోతున్న పొగాకు పంటను పరిశీలిస్తున్న జీవి కొండారెడ్డి

ప్రజాశక్తి-కనిగిరి: కనిగిరి మండలం చాకిరాల గ్రామంలో కరవు వలన ఎండిపోయిన పంటలను ఆదివారం సిపిఎం ప్రతినిధి బృందం పరిశీలించింది. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జీవి కొండారెడ్డి, కనిగిరి మండల కన్వీనర్‌ పిల్లి తిప్పారెడ్డి మాట్లాడుతూ గ్రామంలో 800 ఎకరాల్లో మినుము, 200 ఎకరాల్లో కంది, 100 బ్యారన్ల కింద సాగుచేసిన పొగాకు పైర్లు ఎండిపోయాయని. పశువులు, గొర్రెలు, మేకలు మొదలగు జీవాలకు నీటి కొరత ఏర్పడిందని అన్నారు. మినుము, కంది పంట వేసిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, పొగాకు రైతులకు రుణాలు రీ షెడ్యూల్‌ చేయాలని, తిరిగి సాగుచేసేందుకు ఎకరాకు రూ.10 వేల సహాయం అందిÛంచాలని కోరారు. మినుము పంటను ఈ క్రాప్‌ చేయాలని, జీవాలకు పొలాల్లో తొట్లుపెట్టి నీటిని సరఫరా చేయాలని కోరారు. చాకిరాల గ్రామంలో ఎస్‌బిఐ, సొసైటీ ద్వారా రుణాలు తీసుకున్న రైతుల పెండింగ్‌ సమస్యను పరిష్కరించాలని కోరారు. సమస్యలను పరిష్కరించక పోతే రైతులు ఉద్యమించాలని కోరారు. ప్రతినిధి బందంలో రైతులు ఎం ఆదినారాయణ, కుందూరు శ్రీను, మారంరెడ్డి రమణయ్య, లింగాల పోతులూరయ్య, వంటిపెంట తిరుపతయ్య పాల్గొన్నారు.
దర్శిని కరువు మండలంగా ప్రకటించాలి
దర్శి: దర్శి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు అన్నారు. ఆదివారం దర్శి మండలంలోని చందలూరు గ్రామంలో పంట పొలాలను పరిశీలించారు. ప్రస్తుతం వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, పొగాకు పంట, బర్లీ కోసం ఎకరానికి రూ.32 వేలు, కందికి రూ.10 వేలు పెట్టుబడులు పెట్టి నష్టపోయారని, ప్రభుత్వం ఈ మేరకు నష్టాన్ని ఇవ్వాలని కోరారు. బర్లీ పొగాకు పంట వేసి నలభై రోజులు అయిందని, ఇప్పటికి రూ.32 వేలు పెట్టుబడి పెట్టినట్లు చందలూరుకు చెందిన రైతు పుప్పాల ఆంజనేయులు తెలిపారు. బోరులో కూడా భూగర్భ జలాలు అడుగంటిపోయాయని, నీరు లేక ఇబ్బంది పడుతున్నట్లు ఆయన తెలిపారు. కంది, మిర్చి పంటలు కూడా ఎండిపోతున్నాయన్నారు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఓట్ల కోసం బస్సు యాత్ర చేస్తోందని ఆయన విమర్శించారు. అదే విధంగా మంచినీరు వారానికి ఒకసారి ఇస్తున్నారని అన్నారు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట సీపీఎం నియోజకవర్గ కార్యదర్శి తాండవ రంగారావు, సందు వెంకటేశ్వరరావు, ఆదినారాయణ ఉన్నారు.