ప్రజాశక్తి -కరప
రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు కాకినాడ జిల్లాలో ధాన్యం రాశులు, వరి పొలాలు వర్షం నీటితో మునిగి ధాన్యం రాశులు మొలకెత్తి రైతులు తీవ్ర నష్టాలకు గురైన పరిస్థితుల్ని కాకినాడ జిల్లా రైతు, కౌలు రైతు సంఘం నాయకులు స్వయంగా పరిశీలించారు. నిబంధనలను సడలించి రైతులను ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు టి.నాగేశ్వర రావు, కౌలు రైతులు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.రాజశేఖర్, కార్యదర్శి వల్లు రాజబాబు డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని పలు గ్రామాల్లో వారు పర్యటించి వరి పొలాలను పరిశీలించారు కరపలో పొలాలలోని ధాన్యం ఆరబెడుతున్న కౌలురైతు రెడ్డి చందర్రావు, వెంకట్రావు, నక్కా సాంబయ్య, మేడిశెట్టి రాంబాబు, పేకేటి శ్రీను తదితర రైతుల వద్దకు వెళ్లివద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంఘాల నాయకులు మాట్లాడుతూ మండలంలోని 15 శాతం మాత్రమే మసూళ్లుజరిగాయని, ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం తడిసి మొలకెత్తా యన్నారు. రైతుల కోసం పనిచేసే ప్రభుత్వమే అయితే నిబంధనలు అన్ని సడలించి ధాన్యం కొనుగోలు చేయాలని, రైతులు అమ్మిన ధాన్యానికి ఆరు రోజుల్లోగా సొమ్ములు వారి ఖాతాల్లో జమ చేయాలని. ఈ క్రాప్‌లో కౌలు రైతులను చేర్పించి మేలు చేయాలని, 80 శాతం కౌలు కు సాగు చేస్తున్న కౌలు రైతులకే ప్రభుత్వం ఇస్తున్న నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. టి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఒక్క గింజ కూడా ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రం ద్వారా కొనుగోలు జరగడం లేదని. కొనుగోళ్లు దళారుల ద్వారా జరుగుతున్నదని వాటిని రైతు భరోసా కేంద్రం ద్వారా కొనుగోలు చేసినట్లు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఈ దళారుల ద్వారా వెళ్లిన ధాన్యాన్ని రోజులు తరబడి వచ్చిన వాహనాలను నిలిపి వేస్తున్నారని, మొలకలు, తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పి వాటిని నిలిపివేస్తూ బస్తా 850 నుండి 950 వరకు ధర ఇస్తామని బేరసారాలు చేస్తున్నారన్నారు.. రైతుల వద్దకు ఆర్‌బికెల అధికారులు వచ్చి కళ్ళల్లో ధాన్యాన్ని పరిశీలించే పరిస్థితి లేదని, పరిశీలించినా ట్రాక్ సీట్లు లేవని సమాధానం చెబుతున్నారని రైతులు గగ్గోలు పెడుతు న్నారన్నారు. ఇదే పరిస్థితిలో జిల్లా వ్యాప్తంగా ఉందని, ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే మండలానికి ఒక ప్రత్యేక అధికారి నియమించి వారి పరివేక్ష ణలోని గ్రామ స్థాయిలో వ్యవసాయ అధికారులు, రైతు భరోసా అధికారులు రైతులను చైతన్యపరిచి ధాన్యం కొనుగోలు చేయాలని రైతు సంఘం నాయకులు తెలిపారు. అనంతరం కరప రైతు భరోసా కేంద్రం వ్యవసాయ సహాయకులు ప్రశాంత్ కుమార్‌తో ఫోన్లో సంప్రదించి దళారులు రైతులను మభ్యపెట్టి బస్తా రూ.850 నుండి రూ.95కు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని దళాలు బారిన పడకుండా రైతులను పిలిపించి రైతు భరోసా ద్వారా జరిగే ప్రయోజనాలను వివరించాలని, రైతు భరోసా కేంద్రం ద్వారా కొనుగోలు చేసే లాగా చూడాలని అధికారిని కోరారు.దీనిపై ప్రశాంతకుమార్ రైతులను రైతు భరోసా కేంద్రాలను సంప్రదించాలని కోరారు.
రైతులకు పంట బీమా వర్తింపజేయాలి
కరప రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు తడిసిపోయి రంగు మారి, మొలకలు వచ్చిన ధాన్యాన్ని వెంటనే ఈ ప్రభుత్వం కొనుగోలు చేయాలని జిల్లా టిడిపి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా డిమాండ్ చేశారు. కరపలో గురువారం ఆయన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులకు పంట బీమా వర్తింప చేయాలని డిమాండ్ చేశారు.
తడిసిన ధాన్యం పరిశీలించిన ఎంఎల్‌ఎ చినరాజప్ప
సామర్లకోట రూరల్‌మండలంలోని పెదబ్రహ్మదేవంలో భారీ వర్షాలకు తడిసిన ధాన్యం రాశులను గురువారం ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప పరిశీలించి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం రైతులు ధాన్యం భద్రపర్చుటకు కనీసం తార్‌పాలిన్స్ కూడా ఇవ్వడం లేదని, వర్షాలకు తడిసిన ధాన్యంను ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం పిబిదేవం ఆర్‌బికెలో ధాన్యం కొనుగోలు తీరును ఎంఎల్‌ఎ రాజప్ప పరిశీలించారు. ఆయన వెంట మండల టిడిపి అధ్యక్షుడు తోటకూర శ్రీనువాసు, కాకినాడ పార్లమెంటరీ పార్టీ తెలుగు రైతు అధ్యక్షులు పాలకుర్తి శ్రీనివాసాచార్యులు చౌదరి టిడిపి రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి ఉన్నారు.
తహశీల్దార్ పరిశీలన
ఏలేశ్వరం : ప్రత్తిపాడు మండలం వొమ్మంగి లో అకాల వర్షాలకు తడిసిన వరి చేలను తహశీల్దార్ గోపాలకృష్ణ ప్రత్తిపాడు వ్వయసాయ అధికారి గంగాధర్‌తో కలిసి గురువారం పరిశీలించారు. ఈసందర్భంగా వారు రైతులతో మాట్లాడుతూ కోసి పనల మీద ఉన్న వరి చేలలో నీరు లేకపోయినట్లతే పంట పొలాల్లో ఉండగానే లీటర్‌కు 50 గ్రాముల ఉప్పు ద్రావణం కలిపి పిచికారీ చేయాలన్నారు. పంట చేలల్లో నీరు ఉన్నట్లయితే ఎత్తయిన ప్రదేశానికి పనలు తరలించి ఉప్పు ద్రావణం పిచికారీ చేయాలని సూచించారు. ఎకరాకు 25 కిలోల ఉప్పు పనల మీద జల్లుతూ కుప్పలు వేయాలన్నారు. ఇలా చేయడం వల్ల ధాన్యం మొలకలు రాకుండా, రంగు మారడాన్ని నివారించవచ్చని సూచించారు. తడిసిన ధాన్యం కొనుగోలుపై రైతు భరోసా కేంద్రాల్లో సహాయకులను సంప్రదించవలసిందిగా రైతులకు తెలిపారు.
పిబిదేవంలో తడిచిన ధాన్యంను పరిశీలిస్తున్న ఎంఎల్‌ఎ చినరాజప్ప, టిడిపి నాయకులు










