Sep 14,2023 21:27

సమావేశంలో మాట్లాడుతున్న జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు

ప్రజాశక్తి-విజయనగరం :  రైతులందరికీ అన్ని రకాల ఎరువులు సకాలం లో అందేలా చూడాలని జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరం లో జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం ఎఎబి చైర్మన్‌ వెంకటేశ్వర రావు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిధి గా విచ్చేసిన జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మాట్లాడుతూ అన్ని కాంప్లెక్స్‌ ఎరువులు ఆర్‌బికెలలో అందు బాటులో ఉంచాలని, ధరల నియంత్రణకు టాస్క్‌ ఫోర్సు కమిటీలను వేసి నిఘా పెట్టాలని వ్యవసాయ శాఖ జెడికి సూచించారు. ఎరువులన్ని ఆర్‌బికెలోని కియోస్కో ద్వారానే పంపిణీ చేయాలనీ, అప్పుడు మాత్రమే ప్రభుత్వ సబ్సిడీ వస్తుందని అన్నారు. మండలాల వారీగా ఎక్కెడెక్కడ ఎరువుల కొరత ఉందో గుర్తించి వెంటనే ఇండెంట్‌ పెట్టాలని సూచించారు. ఈ క్రాప్‌ బుకింగ్‌ వేగంగా జరగాలన్నారు. ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని జెడి తారకరామా రావు తెలిపారు. నీటి పారుదల శాఖ అధికారులతో మాట్లాడుతూ ఏయే జలాశయం లో ఎంతెంత నీటి నిల్వలు ఉన్నాయని ప్రశ్నించారు. ధాన్యం సేకరణ సన్నద్దత పై పౌర సరఫరాల జిల్లా మేనేజర్‌ను ప్రశ్నించారు. గత నిబంధనలే వర్తిస్తాయని, కొత్త గా ఈ ఏడాది రైతుల బయో మెట్రిక్‌ కూడా తీసుకోవలసి ఉందని ఉత్తర్వులు అందాయని మీనా కుమారి తెలిపారు. గత ఏడాది సేకరణ కు సంబంధించి బకాయిలు రూ.2.5 కోట్ల రూపాయలు విడుదల అయ్యాయని, వీటితో జీతాలు చెల్లిస్తామని వివరించారు. ముందుగా సొసైటీ లలో చెల్లించని వారికీ చెల్లించాలని చైర్మన్‌ సూచించారు. ఎపిఎంఐపి ద్వారా 5 ఎకరాల లోపు ఉన్న ఆయిల్‌ పామ్‌ రైతులకు డ్రిప్‌ ఇరిగేషన్‌ కోసం 90 శాతం సబ్సిడీ పై అందించనున్నట్లు ఆ శాఖ పీడీ లక్ష్మీనారాయణ తెలిపారు. సమావేశంలో కలెక్టర్‌ నాగలక్ష్మి, జెసి మయూర్‌ అశోక్‌, ఎమ్‌పి బెల్లాన చంద్ర శేఖర్‌, ఎంఎల్‌సి డాక్టర్‌ సురేష్‌ బాబు, ఎమ్మెల్యేలు సభ్యులు బొత్స అప్పలనరసయ్య, కంబాల జోగులు, శంబంగి వెంకట చిన్న అప్పల నాయుడు, డిసిఎంఎస్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ అవనాపు భావన, అధికారులు పాల్గొన్నారు.