Nov 07,2023 20:43

ప్రజాశక్తి - భీమవరం
కౌలు, సన్న, చిన్న కారుల రైతులకు వెన్నుదన్నుగా వైఎస్‌ఆర్‌ రైతు భరోసా నిలుస్తుందని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. వరుసగా ఐడో ఏడాది, రెండో విడతగా జిల్లాలో 1,26,960 మంది రైతులకు రూ.50.784 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. రైతు భరోసాను శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి ప్రారంభించారు. మంగళవారం కలెక్టరేట్‌ నుంచి జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు కొట్టి కుటుంబరావు, జిల్లా వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా పశుసంవర్ధక వ్యవసాయ అనుబంధ శాఖ అధికారులు, రైతులు ఈ కార్యక్రమాన్ని వర్చువల్‌గా తిలకించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ కౌలు రైతులు పెట్టుబడి సాయాన్ని వినియోగించుకుని ఆర్థిక లబ్ధి పొందాలన్నారు. జిల్లా కోస్తా తీరంలో ఉండడం, గోదావరి నది డెల్టా ప్రాంతం కావడం కారణంగా తరచూ తుపాన్లు, వరదలు సంభవించి రైతులు పంట నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వం ఏ పంటకాలంలో దెబ్బతిన్న పంటలకు ఆ పంట కాలం ముగిసే లోపల పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలో రూ.50.784 కోట్లు లబ్ధి
ఆచంట నియోజకవర్గంలో 27,263 మంది రైతులకు రూ.10.905 కోట్లు, భీమవరంలో 10,807 మంది రైతులకు రూ.4.323 కోట్లు, నరసాపురం నియోజకవర్గంలో 13,319 మంది రైతులకు రూ.5.328 కోట్లు, పాలకొల్లులో 12,757 మంది రైతులకు రూ.5.103 కోట్లు, తాడేపల్లిగూడెంలో 21,812 మంది రైతులకు రూ.8.725 కోట్లు, తణుకులో 20,215 మంది రైతులకు రూ.8.086 కోట్లు, ఉండిలో 14,339 మంది రైతులు రూ.5.736 కోట్లు, గణపవరంలో 6448 మంది రైతులకు రూ.2.579 కోట్లు మొత్తం రూ.50.784 కోట్లు రైతులకు లబ్ధి చేకూరిందని తెలిపారు. కార్యక్రమంలో డిఎల్‌డిఒ, ఇన్‌ఛార్జి సహకార శాఖ అధికారి కెసిహెచ్‌ అప్పారావు, జిల్లా వ్యవసాయ అధికారి జెడ్‌.వెంకటేశ్వరరావు, జిల్లా హార్టీకల్చర్‌ అధికారి ఎ.దుర్గేష్‌ పాల్గొన్నారు.