Jun 10,2023 00:33
సమావేశంలో మాట్లాడుతున్న ఏడీఏ సయ్యద్‌ అక్తర్‌ హుసేన్‌

ప్రజాశక్తి-రేపల్లె: వైఎస్‌ఆర్‌ యంత్ర సేవ పథకం అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ శాఖ ఏడిఏ సయ్యద్‌ అక్తర్‌ హుస్సేన్‌ తెలిపారు. వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ యంత్ర సేవ పథకం ద్వారా రైతులకు వ్యవసాయ పనిముట్లను అద్దెకు ఇస్తామని తెలిపారు. వ్యవసాయ పనిముట్లను అద్దె చెల్లించే ప్రాతిపదికన రైతు భరోసా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. రైతులు పనిముట్ల కోసం ఆందోళన చెందకుండా సమయానికి ఉపయోగించుకోవచ్చని అన్నారు. రైతు భరోసా కేంద్రాలలో పచ్చిరొట్ట విత్తనాలైన జనుము, జీలుగ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వ్యవసాయ సలహా మండలి సూచనల మేరకు రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులు పలు సూచనలు చేసినట్లు తెలిపారు. ప్రధానంగా జింకు, జిప్సంను 50 శాతం రాయితీపై ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతు గ్రూపులకు కాకుండా, వ్యక్తిగతంగా పనిముట్లను అందించాలని కోరారని తెలిపారు. వీటిలో టార్పాలిన్‌ పట్టాలు, విద్యుత్‌ మోటార్లు, తైవాన్‌ స్ప్రేయర్లు, రోటా వేటర్లు, కల్టివేటర్లు ఉన్నట్లు తెలిపారు. ఎరువులు, పురుగు మందులు సకాలంలో అందించాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు గ్రామాలలో కూడా ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు. రైతుల సూచనలను ఉన్నతాధికారు లకు నివేదించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి ఆర్‌ విజయబాబు, రైతులు, అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.