ప్రజాశక్తి గోరంట్ల రూరల్ : ప్రపంచంలో అరటి ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానం. అంతేకాక జాతీయస్థాయిలో అరటిపంటదే మొదటి స్థానం. దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా తమిళనాడు అరటిపండ్ల తోటల సాగులో ముందు స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో రైతులకు కాస్తా ఊరటను ఇస్తున్న పంటలలో అరటిపంట కూడా ఒకటి. ఒకప్పుడు అరటి పంట సాగు చేయాలంటే పెట్టుబడులకు కూడా తిరిగి వచ్చేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేసేవారు. కానీ ఇప్పుడు ఎకరాకు ఖర్చులు పోను దాదాపు రూ. 3 లక్షల నుంచి మూడున్నర లక్షల రూపాయల వరకు మిగులుతుందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం అరటి పండ్ల రేట్లు పెరగడంతో రైతు ముఖంలో ఆనందం చూస్తున్నామని అరటితోట సాగు రైతు శివప్రసాద్ అన్నారు. అరటి పంట సాగు విధానం లాభనష్టాలపై రైతు శివప్రసాద్ తన అనుభవాన్ని వివరించాడు. గతంలో ఇతర పంటల సాగు ఎంత పెట్టుబడి పెట్టినా పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చేవి కాదన్నారు. దీంతో పాడి పశువుల పై ఆధారపడి కుటుంబాన్ని పోషించేవాడినని అన్నారు. పాలు అమ్మకొంటూ బోరు బావిలో నీరును పట్టణంలో ట్యాంకులు ద్వారా సరఫరా చేస్తూ జీవనం సాగించేవాడనని అన్నారు. అయితే తన బావ పులివెందుల ప్రాంత వాసి అని ఆయన ప్రోద్భలంతో తనకున్న రెండున్నర ఎకరా పొలంలో అరటి సాగు చేసినట్లు వివరించారు. హైదరాబాదు ప్రాంతం నుండి విక్టోరియా అనే రకాల అరటి పిలకలను ఒక్కొక్కటి 14 రూపాయలు చొప్పున 2500 మొక్కలను కొనుగోలు చేసి సాగు చేశానని చెప్పారు. ఎరువులు, రసానక ఎరువులు, డ్రిప్ మందులు తదితర వాటికి దాదాపు రెండు లక్షల రూపాయలు ఖర్చయిందని అన్నారు. మొదటి పంట అయినందువల్ల పంట బాగా వచ్చిందని, రెండున్నర ఎకరాకు దాదాపు 65 టన్నులు వరకు దిగుబడి వచ్చిందని తెలిపారు. టన్ను రూ. 18వేలతో 65 టన్నులకు దాదాపు రూ. 11.70 లక్షల వరకు వచ్చిందని అన్నారు. పెట్టుబడి రూ.2 లక్షలను పోనూ తనకు రూ.9.70 లక్షలకు మిగిలిందని ఆనందం వ్యక్తం చేశారు. కర్నాటక ప్రాంతవాసులు తోట వద్దకే వచ్చి పంటను కొనుగోలు చేశానని రైతు శివప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం అరటిపంటకు ఉన్న ధరలను అసలు ఊహించలేదని అన్నారు. అరటి తోట సాగుకు తొలిసారి మాత్రమే ఖర్చు అధికంగా ఉంటుందని చెప్పారు. ఈ పంటకు ఈదురు గాలుల నుండి నష్టం వాటిల్లుతుందే కానీ ఇతర తెగుళ్లు ఉండవన్నారు. ఏవైనా తెగుళ్లు కనపడిన వెంటనే ఆ అరటి పిలకను తొలగిస్తే సరిపోతుందని అన్నారు. అరటి సాగుపై ఉద్యానవన శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించి పంటసాగుకు ప్రోత్సహిస్తే కరువుజిల్లా రైతులకు ఈ పంట కాస్త ఊరటగా ఉంటుందని రైతు శివప్రసాద్ తెలిపారు.










