Sep 18,2023 00:15
భట్టిప్రోలు వ్యవసాయ మార్కెటింగ్‌ యార్డు

ప్రజాశక్తి-భట్టిప్రోలు: రైతుల ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ యార్డులు ప్రస్తుతం ప్రభుత్వానికి తప్ప రైతులకు ఉపయోగపడటం లేదు. మార్కెటింగ్‌ యార్డులో ఉన్న గోదాములను లీజు పద్ధతిపై వ్యాపారస్తులకు అప్పజెప్పి ప్రభుత్వం సొమ్ము చేసుకుం టోంది. కానీ రైతులకు మాత్రం ఏమాత్రం ఉపయోగపడ కుండా నిరుపయోగంగా ఉన్నాయి. గతంలో యార్డులో ఉన్న గోదాముల్లో రైతులు తమ పంట ఉత్పత్తులను నిల్వ చేసుకుని వాటిపై యార్డ్‌ వద్ద రుణాలు కూడా పొందే వారు. పంట ఉత్పత్తులకు అధిక ధరలు లభించగానే ఇక్కడి నుంచి లోను చెల్లించి మిగిలిన లాభాలను రైతులు పొందేవారు. కానీ గత నాలుగైదు ఏళ్లుగా మార్కెటింగ్‌ యార్డులో ఎలాంటి పంటలు నిల్వలు లేకపోవడంతో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోయినా నిల్వ చేసుకునే మార్గంలేక అయిన కాడికి అమ్ముకోక తప్పడంలేదని రైతులు వాపోతున్నారు. వేమూరు మార్కెటింగ్‌ యార్డ్‌ పరిధిలో వేమూరుతో పాటు భట్టిప్రోలు యార్డు కూడా ఉంది. దీనికి అనుసంధానంగా భట్టిప్రోలు, వెల్లటూరు, పెదరావూరు, వెల్లలూరు లలో చెక్‌ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ చెక్‌ పోస్టుల ద్వారా వేమూరు మార్కెటింగ్‌ యార్డుకు ఆదాయం సమకూరు తుంది. దీనితోపాటు వేమూరు భట్టిప్రోలు యార్డులలో ఉన్న గోడౌన్లను అద్దె ప్రాతిపదికపై వచ్చే ఆదాయం కూడా తోడవుతుంది. ఈ ఆదాయంతో యార్డ్‌ సిబ్బంది, చెక్‌ పోస్టులలో పనిచేసే సిబ్బందికి మాత్రమే వేతనాల రూపంలో ఖర్చు అవుతుంది. మిగిలిన సొమ్మును రైతుల పంట ఉత్పత్తుల తరలింపునకు అవసరమైన డొంక రోడ్లను అభివృద్ధి పరచాల్సి ఉంది. కానీ ఈ నాలుగైదేళ్లలో ఎక్కడా ఒక్క డొంక రోడ్డును కూడా అభివృద్ధిపరిచిన దాఖలు లేవు. ముఖ్యంగా భట్టిప్రోలు మార్కెట్‌ యార్డ్‌ గతంలో రేపల్లె యార్డు పరిధిలో ఉండేది. నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా భట్టిప్రోలు వేమూరు పరిధిలోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ యార్డులలో రైతులకు చేకూరిన ప్రయోజనాలు ఏమీ లేవు. మరి దీనిపై వచ్చే ఆదాయం ఏమవుతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవల వేమూరు మార్కెట్‌ యార్డ్‌ కింద నూతన కమిటీ కూడా ఎంపికయింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, యార్డు పాలకవర్గం రైతులపై దృష్టి సారించి యార్డులోని గోదాముల్లో తమ పంటలను నిలువ చేసుకునే సౌకర్యం కల్పించాలని రైతులు కోరుతున్నారు.
ఈ విషయంపై వేమూరు మార్కెటింగ్‌ యార్డు కమిటీ చైర్మన్‌ ఉప్పు శిరీష మాట్లాడుతూ వేమూరు మార్కెట్‌ ద్వారా వచ్చే ఆదాయంతో రైతులకు అవసరమైన రహదారుల నిర్మాణానికి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. భట్టిప్రోలు యార్డు పరిధిలో ఐలవరం గ్రామం వద్ద మరో చెక్‌పోస్టును కూడా ఏర్పాటుచేసి యార్డుకు మరింత ఆదాయాన్ని సమకూర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కమిటీ డైరెక్టర్‌ల ద్వారా ఆయా గ్రామాలలో అవసరమైన, ప్రధానమైన రహదారులను ఎంపిక చేసుకోవటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు.