ప్రజాశక్తి - బలిజిపేట : ప్రతి ఏడాదిలాగే పెదఅంకలాం రిజర్వాయర్ నుంచి సాగునీరు బలిజిపేట మండల రైతులకు అందని ద్రాక్షలా మారింది. జైకా నిధులు సుమారు రూ.17కోట్లు కాలువ అభివృద్ధి పనులకు కేటాయించారు. అయితే ఈ నిధులను అధికారులు, పాలకులు ఏం చేశారో తెలియదు కానీ రైతులకు మాత్రం సాగునీరందక తీవ్ర అవస్థలుపడుతున్నారు. కాలువ పనులు, పూడికతీతలు తీయకపోవడంతో సాగునీరందక పలగర, చిలకలపల్లి గ్రామాల రైతులు శ్రమదానంతో వారి పనులను పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆనకట్టు ప్రధాన కాలువలో పూడికపోయిన గుర్రపు డెక్కలను తీస్తూ, చప్టాలను, ఇసుక బస్తాలతో కప్పుకుంటూ పూర్తిగా ఎండిపోయిన వరి పంట సాగు నీటి కోసం వారు నానా తిప్పలు పడుతున్నారు. సొంత గ్రామానికి చెందిన ఎమ్మెల్యే మన వారే అయినా సాగు నీరు సమస్య మాత్రం పరిష్కారం కావడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు, అధికారులు త్మ ఇబ్బందులు పట్టించుకోకపోవడంతో చివరి భూములను సాగునీరందడంలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చివరి భూమి రైతులకు నీరందేలా ప్రయత్నం చేయాలని స్థానిక నాయకులు ఈ విషయంపై దృష్టి పెట్టాలని, ఆ దిశలో ఉన్న పంటను కాపాడాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.










