
ప్రజాశక్తి- నక్కపల్లి:ప్రత్యామ్నాయ తేలిక రకాలైన వరి విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచుతాం అని జిల్లా వ్యవసాయ అధికారి బి.మోహన్ రావు తెలిపారు. మండలం లో శుక్రవారం దేవవరం, చిన రామ భద్రపురం,గొడిచెర్ల, ఉద్దండపరం గ్రామాల్లో వరి నారు మడులను క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా వ్యవసాయ అధికారి ఉమా ప్రసాద్, సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఎండిన వరి ఆకును పరిశీలించారు.మండలంలో 5125 ఎకరాలు సాధారణ వరి సాగు వుండగా ఇప్పటి వరకు 500 ఎకరాలు వరకు వుడుపులు అయినట్లు తెలిపారు. 40 శాతం వర్షపాతం లోటు ఉండటం, నీటి వసతి లేక నారు మడులు బెట్టు పరిస్థితులు ఎదుర్కొని ఎండి పోతున్నాయన్నారు. వర్షాభావ పరిస్థితులను దష్టిలో పెట్టుకుని రైతులకు కావాల్సిన మధ్యస్త రకాలు ఎం టి యు 1156, ఎం టి యు 1121, ఎన్ ఎల్ ఆర్ 34449 రకాల వరి విత్తనాలను అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతుందన్నారు. వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో ఖరీఫ్ సీజన్ సంబంధించి ఎండి పోయిన వరి పంటల నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని రైతులకు తెలియజేశారు. ప్రతి పంటను తప్పనిసరిగా ఈ పంట నమోదు చేసుకోవాలన్నారు. మండలంలో 653 పీఎం కిసాన్ రైతుల పట్టాలకు ఆధార్ అనుసంధానం కాలేదని ,వెంటనే అనుసంధానం చేసుకోవాలన్నారు .ఈ కార్యక్రమంలో ఏఈఓ సత్యనారాయణ, ఆర్ బి కే సిబ్బంది పాల్గొన్నారు.