జిల్లా సమీక్షా సమావేశంలో అధికారులను, మంత్రులను ప్రశ్నించిన ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు
ప్రజాశక్తి - భీమవరం రూరల్
'రైతు పండించిన ధాన్యానికి సరిపడా సంచులు కూడా ఇవ్వలేరా' అంటూ ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు(ఐవి) తనదైన శైలిలో కలెక్టర్ ప్రశాంతిని, రాష్ట్ర మంత్రులు కారుమూరి నాగేశ్వరరావును, కొట్టు సత్యనారాయణను నిలదీశారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లో కలెక్టర్ పి.ప్రశాంతి అధ్యక్షతన జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, జెడ్‌పి ఛైర్మన్ కె.శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎంఎల్‌సి వెంకటేశ్వరరావు ప్రజా సమస్యలపై తన గళాన్ని కలెక్టర్, మంత్రుల ముందు గట్టిగా వినిపించారు. ముందుగా రైతులు ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని, తాను భీమవరం, పాలకొల్లు మండలాలకు వెళ్లినప్పుడు రైతులు తమ బాధను చెప్పారన్నారు. తమ ప్రాంతంలో అలాగే అసలు భూములు ఎన్ని ఉన్నాయి? ఎంతమంది రైతులున్నారు? అనేది లెక్కిస్తే కౌలురైతు కార్డుల మంజూరులో పొంతన లేదని విమర్శించారు. తణుకు సమీపంలోని ఎపి సీడ్స్‌లో కార్మికులను తొలగింపుపై ఆందోళన చేస్తే జట్టు కార్మికులకు టెండర్ పిలుస్తామని చెప్పారని, ఇది తాను ఎక్కడా వినలేదని, విడ్డూరంగా ఉందని తెలిపారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఈ విషయంలో తనకు ఎలాంటి ఫిర్యాదూ రాలేదని, లేబర్ అధికారులతో మాట్లాడుతానని చెప్పారు. అలాగే జగనన్న స్థలాల మట్టి పూడికపేరుతో కోర్టు స్టే ఉన్న చించినాడలోని పెరుగు భూముల మట్టి తరలిస్తారని ప్రశ్నించారు. దీనిపై ఆందోళన చేస్తున్న దళితులను అన్యాయంగా అరెస్టు చేస్తున్నారని, వాటిని ఆపాలని కోరారు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ ఆ మట్టిని పాలకొల్లు, నరసాపురం ప్రాంతాల్లోని జగనన్న కాలనీలకు తరలిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వాసుపత్రిలో రోగులకు సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారని, అయినా ఏ ఒక్కరు పట్టించుకోవడం లేదని విమర్శించారు. విద్యావ్యవస్థ బలోపేతానికి నాడు-నేడు పేరుతో పాఠశాలను ఎన్నడూ లేని విధంగా ఎంతో అభివృద్ధి చేస్తున్నామని మంత్రులు వివరించారు. దీనిపై ఎంఎల్‌సి మాట్లాడుతూ ఒకటి, రెండు, మూడు తరగతుల స్కూళ్లను ఎందుకు మూసేశారని, ఆ చిన్నారులు విద్యకు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుందని, ఇదేనా తమరు చేసే అభివృద్ధిని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఎంఎల్‌సికి, మంత్రుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ సమావేశంలో ఉంగుటూరు ఎంఎల్‌ఎ పుప్పాల వాసుబాబు, జెసి, ఆర్‌డిఒ, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.










