May 02,2023 00:09

తడిసి ధాన్యాన్ని పరిశీలిస్తున్న ఇన్‌ఛార్జి కలెక్టర్‌ ఇలాక్కియా..,,, పంట నష్టం పై అధికారులతో మాట్లాడుతున్న మంత్రి వేణుగోపాలకృష్ణ

కోతలు వాయిదా వేసుకోండి
- కాకినాడ జిల్లా ఇన్‌ఛార్జ్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ

ప్రజాశక్తి-సామర్లకోట రూరల్‌
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనాల ప్రకారం ఉపరితల ద్రోణి ప్రభావంతో కాకినాడ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, విపత్తు నియంత్రణ చర్యలు చేపట్టాలని ఇన్‌ఛార్జ్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ ఆదేశించారు. సోమవారం ఇన్‌ ఛార్జ్‌ కలెక్టర్‌ సామర్లకోట మండలంలోని ఉండూరు, వల్లూరు, మామిళ్ళదొడ్డి, వేట్లపాలెం గ్రామాల్లో పర్యటించారు. వరి పొలాలను సందర్శించి, ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు తెలిపారు. ఈ నెల 4వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా తేలికపాటి నుంచి వర్షాలు కురవనున్నందున అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రజలను అప్రమత్తం చేసి, అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా ఇది రబీ సీజన్‌ పంట చేతికొచ్చే సమయం కాబట్టి ఆర్‌డిఒలు, జిల్లా వ్యవసాయ అధికారి, పౌర సరఫరాల అధికారి, పౌర సరఫరాల జిల్లా మేనేజర్‌, ధాన్యం సేకరణ ప్రత్యేక అధికారులు, వ్యవసాయ శాఖ ఏడీలు, మండల వ్యవ సాయ అధికారులు తదితరులు వర్ష ప్రభావిత వరి పొలాలను సందర్శించాలని స్పష్టం చేశారు. తిరిగి పొడి వాతావరణం నెలకొనే వరకు వరి కోతలను వాయిదా వేసుకునేలా రైతులకు సూచిం చాలన్నారు.
కళ్లాల్లో ధాన్యం ఉంటే వాటిని టార్పాలిన్లతో కప్పి సురక్షితంగా ఉండేలా చూడాలన్నారు. ఒకవేళ రైతులు కోరితే ధాన్యాన్ని తక్షణం మిల్లులకు తరలించేలా చూడాలన్నారు. అవసరమైన గన్నీ బ్యాగులు, ఇతర సహాయాన్ని జిల్లా అధికార యంత్రాంగం అందిస్తుందన్నారు. పనల మీద ముఖ్యంగా కంకుల మీద పడేటట్లు 5 కిలోల ఉప్పును 100 లీటర్ల నీటిలో కరిగించి ఆ ద్రావకాన్ని పనలు, కంకులపై చల్లడం వల్ల గింజలు మొలకెత్తకుండా ఉంటాయని జాయింట్‌ కలెక్టర్‌ ఇలక్కియ సూచించారు. ఎఒ ఇమ్మిడిశెట్టి సత్య మాట్లాడుతూ మండలంలో రబీ కి సంబందించి 22,142 ఎకరాల్లో వరి సాగు జరిగిందని, 9800 ఎకరాల్లో వరి కోతలు పూర్తిఅయ్యాయని, 2000 ఎకరాలకు సంబంధించిన ధాన్యం రాశులు కళ్లాలపై ఉన్నాయన్నారు. ఆమె వెంట మండల తహశీల్దార్‌ ఎన్‌ లక్ష్మీనరస కుమారి, ఆర్‌ఐ ఎం రాజేష్‌, ఎఇవోలు సతీష్‌, శాంతి, విఆర్వోలు, విఎఎలు, విఆర్‌ఎలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా ఇన్‌చార్జి కలెక్టర్‌ పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు.
కంట్రోల్‌ రూం ఏర్పాటు:
వర్షాల ప్రభావంతో చెట్లు, స్తంభాలు కూలే ప్రమాదం ఉన్నందున ప్రజలు జాగ్తత్రగా ఉండాలని.. రెవెన్యూ, విపత్తు నిర్వహణ, రహదా రులు, భవనాలు, విద్యుత్‌ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఎక్కడా ఎలాంటి ప్రమాదం జరక్కుండా చూడాలని ఇన్‌ఛార్జ్‌ కలెక్టర్‌ ఇలాక్కియా సూచించారు. 18004253077 నంబరుతో జిల్లా స్థాయిలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండల అధికారులు అందరూ తమ తమ ప్రధాన కార్యస్థానాల్లో సహాయ చర్యల నిమిత్తం విధిగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అన్ని కమ్యూనికేషన్‌ వ్యవస్థలు ఎలాంటి అంతరాయం లేకుండా పనిచేసే స్థితిలో ఉంచాలని ఆదేశించారు. తాళ్లరేవు మండలంలో తాళ్ళరేవు, పోలేకుర్రు, పి. మల్లవరం గ్రాంటు తదితర చోట్ల పంట పొలాలు దెబ్బతిన్నాయి. అకాల వర్షానికి నీట మునిగిన పంట పొలాలకు, తడిసిన ధాన్యానికి ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని రైతన్నలు వేడుకుంటున్నారు.
ఇన్‌ పుట్‌ సబ్సిడీ ఇచ్చేందుకు కషి
కాజులూరు మండలంలో మంత్రి వేణుగోపాలకృష్ణ సోమవారం రెవెన్యూ వ్యవసాయ అధికారులతో కలిసి ముంపు ప్రాంతంలో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా ఇన్పుట్‌ సబ్సిడీ అందిం చేందుకు ప్రభుత్వంతో చర్చిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి వెంట తహశీల్దార్‌ సత్యనారాయణ ఎఒ అశోక్‌ మండల బిసి సెల్‌ కన్వీనర్‌ గుబ్బల యేసు రాజు, అధికారులు రైతులు కౌలు రైతులు ఉన్నారు.
రోడ్లు జలమయం :
కాకినాడ కార్పొరేషన్‌ : సోమవరం తెల్లవారు నుంచి కురిసిన వర్షానికి రహదారులు చెరువులను ఎడతెరిపు లేకుండా కురిసిన వర్షానికి భానుగుడి సెంటర్‌, మెయిన్‌ రోడ్డు, సినీమా రోడ్డు,జగనాధాపురం, రామారావు పేట, గాంధీనగర్‌, ఆర్టీసీ కాంప్లెక్స్‌ ,కాకినాడ కలెక్టరేట్‌ ఏరియా కురిసిన వర్షానికి మునిగిపోయాయి.