Nov 07,2023 00:19

బూర్జ పిఎసిఎస్‌ భవనం

* అమార్క్‌ఫెడ్‌కు బ్యాంకు గ్యారంటీ
ఇవ్వని పిఎసిఎస్‌ అధికారులు
* ఖరీఫ్‌లో ఎరువుల
కేటాయింపు నిలిపివేత
* బూర్జ పిఎసిఎస్‌లో
అవకతవకల ఫలితం
ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి:
 బూర్జ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ద్వారా రైతులను ఆదుకోవాల్సిన అధికారులు వారిని నట్టేట ముంచుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాము తీసుకున్న అప్పును పూర్తిగా చెల్లించినా రికార్డుల్లో తమ పేరున రుణం ఉండటం, వాయిదా సొమ్ములు చెల్లించినా జమ కాకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. అప్పు తీసుకోకపోయినా నోటీసులు ఇస్తుండటంతో రైతులు అవాక్కతున్నారు. దీనిపై ఇప్పటికే సహకార శాఖ అధికారులు విచారణ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. తాము కట్టిన సొమ్ము జమ ఆందోళనలో ఉన్న రైతులకు పిఎసిఎస్‌ ద్వారా ఖరీఫ్‌లో మరో నష్టం వాటిల్లింది. పిఎసిఎస్‌ ద్వారా ఏటా ఏడాది ఎరువులు పొందిన రైతులకు ఈ సంవత్సరం నోచుకోలేకపోయారు. పిఎసిఎస్‌లకు అవసరమైన ఎరువులను వ్యవసాయశాఖ అధికారులు కేటాయిస్తారు. బ్యాంకు గ్యారంటీలు సమర్పించే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు మార్క్‌ఫెడ్‌ అధికారులు ఎరువులను కేటాయిస్తారు. ఈ సంవత్సరం బ్యాంకు గ్యారంటీలు సమర్పించకపో వడంతో ఎరువులు కేటాయింపులు జరగలేదు.
ప్రయివేట్‌గా కొనుగోళ్లు
పిఎసిఎస్‌ ద్వారా ఎరువులు అందించకపోవడంతో రైతులు ప్రయివేట్‌ డీలర్ల వద్ద కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక సచివాలయం ద్వారా అందించినా అవి చాలకపోవడంతో బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేశారు. గతేడాది ఖరీఫ్‌లో 80 మెట్రిక్‌ టన్నుల యూరియా, 60 మెట్రిక్‌ టన్నుల డిఎపి అందించారు. ఈ సంవత్సరం బ్యాంకు గ్యారంటీ ఇవ్వకపోవడంతో కేటాయింపులు జరగలేదని తెలుస్తోంది.
బ్యాంకు గ్యారంటీ ఇవ్వకపోవడానికి కారణమదేనా?
బూర్జ పిఎసిఎస్‌ పరిధిలో ఈ సంవత్సరం ఖరీఫ్‌లో ఎరువులు అందకపోవడానికి సొసైటీ పెద్ద మనిషే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిధుల అవకతవకలతో ప్రాథమిక పరపతి సంఘం పరపతి కోల్పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పిఎసిఎస్‌ కరెంట్‌ ఖాతాలో తగినంత బ్యాలెన్స్‌ లేకపోవడం వల్ల సంబంధిత బ్యాంకు గ్యారంటీ ఇవ్వలేదని తెలుస్తోంది. ఆ డబ్బులను విత్‌ డ్రా చేశారన్న ఆరోపణలూ లేకపోలేదు. ఫలితంగా ఎరువులు కేటాయింపులు జరపకపోవడం, రైతులు బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి.