ప్రజాశక్తి -కోటవురట్ల:మండలంలో తాండవ కాలువ కింద సాగు చేస్తున్న రైతులకు ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి నీరు సక్రమంగా అందక పోవడంతో ఆదివారం పాములవాక గ్రామానికి చెందిన రైతులు శ్రమదానంతో పూడికతీత చేపట్టారు. పాములవాక మాజీ సర్పంచ్, వైసీపీ మండల అధ్యక్షులు కిల్లాడ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రైతులంతా కలిసి శ్రమదానం చేపట్టారు.ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ గడిచిన పక్షం రోజులుగా సాగునీటి పారుదల మందగించడంతో సక్రమంగా వచ్చేది కాదని, ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ పొలాలు పొట్ట, కంకి దశకు చేరుకున్నాయని తెలిపారు. ఇటువంటి సందర్భంలో పొలాలకు నీరు అధికంగా అవసరం ఉండటంతో రైతులంతా ఏకమై శ్రమదానంతో కాలువల పూడికతీత చేపట్టామన్నారు. మండల వ్యాప్తంగా దిగువ ప్రాంతంలో పలు గ్రామాల పొలాలకు నీరు అందడంతో ఆయా ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేశారు.










