
ప్రజాశక్తి-బొబ్బిలి : నదుల ను అనుసంధానం చేసి రైతులకు సాగునీరు ఇవ్వాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. గంటి ప్రసాదం భవనంలో గురువారం రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అని చెపుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులకు సాగునీరు ఇవ్వడంలో విఫలమయ్యారని విమర్శించారు. జిల్లాలో సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు ఇవ్వడంలో పాలకులు విఫలమవుతున్నారని తెలిపారు. జిల్లాలో ఉన్న నదులను సాగనీటి కాలువలకు అనుసంధానం చేసి సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాగునీటి ప్రాజెక్టులను ఆధునీకరణ చేయాలన్నారు. రైతు పండించే ఆహార ఉత్పత్తులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. వర్షాభావంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నీరు లేక ఎండిపోతున్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు ఎస్.గోపాలం, బి.రాంబాబు, రైతులు పాల్గొన్నారు.
కలెక్టర్‌కు ఎపి రైతు సంఘం లేఖ
విజయనగరం టౌన్ : జిల్లాలో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల్లో ప్రాజెక్టుల నుంచి నీటిని చివరి భూములు వరకు అందించి పంటలను కాపాడాలని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి. రాంబాబు గురువారం జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. జిల్లా లో వర్షాభావ పరిస్థితుల వల్ల వరి పంట నీరు లేక ఎండిపోతోందని పేర్కొన్నారు. తోటపల్లి, వెంగలరాయ, తాటిపూడి, ఆండ్ర ప్రాజెక్టులు, ఆనకట్టలు, చిన్న నీటి వనరుల నుంచి చివరి ఆయకట్టు భూములకు నీరు వెళ్లక ఎండి పోతున్నాయని తెలిపారు. కాలువల నిర్వహణ లేకపోటంతో నీరు వున్నప్పటికీ శివారు భూములకు అందడం లేదని తెలిపారు. శివారు భూములకు నీరందించేవిధంగా నీటిపారు దల శాఖ సిబ్బందికి ఆదేశాలివ్వాలని కోరారు.