
ప్రజాశక్తి- నక్కపల్లి:వైజాగ్ -చెన్నై ఇండిస్టీల్ కారిడార్ లో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల కొరకు రోడ్డు వేసేందుకు సేకరిస్తున్న భూములకు న్యాయపరమైన నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ రైతులతో కలిసి సోమవారం స్పందనలో అనకాపల్లిలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి కు వినతిపత్రం అందజేసినట్లు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలరాజు స్థానిక విలేకరులకు తెలిపారు. మండలంలోని న్యాయంపూడి, కాగిత, వేంపాడు రెవెన్యూ పరిధిలో న్యాయంపూడి, కాగిత, పాటిమీద గ్రామాల భూములు సేకరించి 150 అడుగుల వెడల్పుతో రోడ్డు వేయడానికి ఏపీఐఐసీ అధికారులు భూములు సేకరించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. భూసేకరణ కారణంగా తరతరాల జీవనోపాధిని తామంతా శాశ్వతంగా కోల్పోతున్నామని, వాస్తవానికి భూములు ఇవ్వడానికి ఇష్టం లేదని, అయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని, ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో జీవనోపాధిని, మా బ్రతుకును త్యాగం చేసి భూములు ఇచ్చేందుకు సిద్ధపడినట్లు రైతులు జెసి దృష్టికి తీసుకువెళ్లారు. అధికారులు ఏ మాత్రం తమ త్యాగాలు గుర్తించకుండా, ప్రస్తుతం భూములకు ఉన్న విలువకు తగ్గట్టుగా నష్టపరిహారం చెల్లించకుండా తీవ్ర అన్యాయం చేస్తున్నారని జేసీ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.
రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలరాజు, అమలాపురం గ్రామ సర్పంచ్ శంకరరావు, రైతులు మాట్లాడుతూ, వైజాగ్-చెనై ఇండిస్టీల కొరకు నక్కపల్లి మండలంలో రాజయ్యపేట నుండి దోనివాని లక్ష్మీ పురం వరకూ 5 రెవెన్యూ గ్రామాలలో 5,500 ఎకరాలు సేకరించి ఓకే విధంగా నష్టపరిహారం చెల్లించారని, ఆ విధంగానే 3 రెవెన్యూ గ్రామాలలో రోడ్డు వేసేందుకు సేకరించిన భూములు కూడా ఒకే విధంగా పరిహారం చెల్లించాలని కోరారు. భూములు కోల్పోయిన ప్రతీ కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరికీ ఆర్ కార్డు లు ఇచ్చి , ఇక్కడ ఏర్పాటు చేసే పరిశ్రమల్లో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. చెట్లు, నిర్మాణాలు కోల్పోతున్న వీరికి జీవో 268 ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని, 2013 భూసేకరణ ప్రకారం ప్యాకేజీలు ఇవ్వాలని కోరారు. భూ సేకరణకు నియమింపబడిన ప్రత్యేక ఉప కలెక్టర్ రైతులను బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నారని, పద్ధతి మార్చుకునే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. సమస్య పరిష్కరించే వరకు భూములు జోలికి అధికారులు రావద్దన్నారు. ఈ కార్యక్రమంలో రావి చిన్ని, రోకల శ్రీను, పెంటకోట నర్సింగరావు, నాగనబోయిన ఈశ్వరరావు పాల్గొన్నారు.