రైతులకు పరిహారం అందించండి
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి
మాండూస్ తుపాన్ కారణంగా వేసిన పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దాసరి జనార్ధన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం రైతు సంఘం ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజనల్ అధికారికి, వ్యవసాయశాఖ ఏడీఏకు వినతి అందించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దాసరి జనార్దన్ మాట్లాడుతూ జిల్లాలో తుపాన్ కారణంగా రైతులు భారీగా నష్టపోయారన్నారు. వారికి ఎకరాకు కనీసం రూ.25 వేలు కనీస పరిహారం చెల్లించాలని డిమాండు చేశారు. చెరువు గండ్లను, రహదారులను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం మాజీ జిల్లా కార్యదర్శి అంగేరి పుల్లయ్య, ఉపాధ్యక్షులు రంగయ్య, పెనగడం గురవయ్య, వెంకటేశ్వరరావు, గెడి వేణు పాల్గొన్నారు.










