Nov 17,2022 23:53

హాజరైన నాయకులు

ప్రజాశక్తి-నర్సీపట్నంరూరల్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అన్యాయం చేస్తున్నాయని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్‌ విమర్శించారు. గురువారం సర్సీపట్నం ఒక ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో రైతు సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నూకినాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ప్రసాద్‌ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా తీవ్ర అన్యాయం చేస్తున్నాయన్నారు. వ్యవసాయరంగం నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడు తుందన్నారు. ప్రభుత్వాలు రైతుల సబ్సిడీపై కూడా కోత పెడుతున్నాయని, రుణాలు ఇవ్వలేదన్నారు.
సిపిఐ అనకాపల్లి జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ మాట్లాడుతూ, జిల్లాలో మూతపడిన షుగర్‌ ఫ్యాక్టరీలను తెరిపించేలా పోరాటం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావు జగ్గారావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి పి.గంగాభవాని, అనకాపల్లి జిల్లా రైతు సంఘం కార్యదర్శి మేకా సత్యనారాయణ, సిపిఐ అనకాపల్లి జిల్లా సహాయ కార్యదర్శి రాము నాయుడు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జి. గురు బాబు, వ్యవసాయ కార్మిక సంఘం అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ఎస్‌.కొండలరావు, ఉపాధ్యక్షులు వెలుగుల అర్జునరావు పాల్గొన్నారు.