May 13,2023 00:54

మాట్లాడుతున్న సిహెచ్‌ బాబూరావు

ప్రజాశక్తి-గుంటూరు : ఇటీవల అకాల వర్షాలకు నష్టపోయిన పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు కోరారు. శుక్రవారం బ్రాడీపేటలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు ఎస్‌ఎస్‌.చెంగయ్య అధ్యక్షతన జిల్లా కమిటీ విస్తృత సమావేశం జరిగింది. బాబూరావు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక నిత్య జీవితావసర సరుకుల ధరలు, పెట్రోలు, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు పెరిగిపోయాయని, ప్రజల ఆదాయాలు పెరగలేదని ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని, విభజన చట్టంలోని హామీల అమలు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయింపు లేదని అన్నారు. విశాఖ రైల్వేజోన్‌, కడప ఉక్కు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయింపు లేదన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చాక దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా వున్న ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతున్నారని, ఈ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉధ్యమించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం బాటలోనే పయనిస్తోందని, విధ్యుత్‌ సంస్కరణల చట్టంలో భాగంగానే వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించే ప్రయత్నం చేస్తున్నారుని, చెత్తపన్ను వసూళ్లు, ఆస్తి పన్ను పెంపు కేంద్రం విధానాలలో భాగమని వివరించారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో ఇళ్ళ స్థలాలు లేని పేదలకు అదే గ్రామంలో స్థలాలివ్వాలని కోరారు. అకాల వర్షాల వల్ల మిర్చి, ప్రత్తి, పసుపు, శనగ పంటలు దెబ్బతిన్నాయని వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారమివ్వాలని కోరారు. గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించాలని, దీని కోసం నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జగనన్న కాలనీలలో ఇళ్ళ నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేయాలని, పసుపు పంటను ప్రభుత్వం ప్రకటించిన క్వింటాళ్‌ రూ.6850కు కొనగోలు చేయాలని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనగోలు చేయాలని కోరారు. జిల్లాలో ప్రభుత్వ భూముల్లో ఇళ్లేసుకుని నివాసముంటున్న పేదలకు పట్టాలు మంజూరు చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.నేతాజి, ఇ.అప్పారావు, కె.నళీనికాంత్‌, ఎన్‌.భావన్నారాయణ, ఎం.రవి, జిల్లా నాయకులు పాల్గొన్నారు.