రైతులకు న్యాయం చేయాలి
ప్రజాశక్తి-అనంతసాగరం : జాతీయ రహదారి నెంబర్ 67 నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు 2013 భూ సేకరణ చట్ట ప్రకారం రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రైతుసంఘం జిల్లా అధ్యక్షులు పులిగండ్ల శ్రీరాములు డిమాండ్ చేశారు. జాతీయ రహదారి 67లో భూములు కోల్పోతున్న ముత్తుకూరు, వెంకటాచలం, మనుబోలు, పొదలకూరు, చేజర్ల, కలువాయి, అనంతసాగరం, మర్రిపాడు మండలాల్లోని భూ నిర్వాసితులకు న్యాయమైన నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతుసంఘం ఆధ్వర్యంలో బయల్దేరిన జాతా శుక్రవారం అనంతసాగరం మండలానికి చేరుకుంది. మండలంలోని లింగంగుంట, పాతదేరాయపల్లి, ఇనగలూరు, వెంగంపల్లి, ఆమని చిరువెళ్ల గ్రామాలలోని భూనిర్వాసిత రైతులను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా వ్యకాసం జిల్లా కార్యదర్శి మంగళ పుల్లయ్య మాట్లాడుతూ మండలంలో మొత్తం 150 ఎకరాల భూమిని రైతులు కోల్పోయారని, మండలాల రెవెన్యూ అధికారులు రైతులకు నష్టపరిహారం గురించి ఇంతవరకు నోటీసులు ఇవ్వకుండా, కనీసం అవార్డు ప్రకటించకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. చేజర్ల మండలంలోని కాకువాయి, నాగులేటూరు గ్రామాలలోని రైతులకు మోసపూరితంగా వారి వద్ద నుంచి భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు బ్యాంక్ అకౌంట్లు తీసుకొని రూ.3లక్షలు వేయడం దుర్మార్గమన్నారు. ఆరుగాలం కష్టించి భూమిని నమ్ముకునే బతికే రైతుకు ద్రోహం చేసే విధంగా మండలాల అధికారులు ఉన్నారని విమర్శించారు. కావున భూ నిర్వాసిత రైతులకు న్యాయమైన నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ఆగస్టు 21వ తేదీ సోమవారం కలెక్టర్ ఆఫీస్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. కావున భూములు కోల్పోతున్న రైతులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో వ్యకాసం జిల్లా అధ్యక్షులు జొన్నలగడ్డ వెంకమరాజు, రైతుసంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య, కౌలు రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గంటా లక్ష్మీపతి, పాత దేవరాయ పల్లి సర్పంచ్ రమీజా బేగం, సిఐటియు అనంతసాగరం మండల కార్యదర్శి అన్వర్ బాషా, రైతు సంఘం అనంతసాగరం మండల కార్యదర్శి ఉప్పలపాడు మస్తాన్, వ్యకాసం మండల కార్యదర్శి సత్తార్, భూ నిర్వాసితులు పాల్గొన్నారు.










