
రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : 2013 ఆర్‌ఒఆర్ చట్టం ప్రకారం ఏడు రెట్లు భూమి విలువకు మార్కెట్ వ్యాల్యూకు నష్టపరిహారం ఇచ్చే విధంగా జిఒ విడుదల చేసిందని, ఆ ప్రకారంగా రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, ఎపి రైతుసంఘం, కౌలు రైతు సంఘం నాయకులు అన్నారు. సోమవారం రైతు సంఘం నాయకులు ఆత్మకూరు ఆర్‌డిఒ కె మధులతను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం రైతు సంఘం నాయకులు లక్కు కృష్ణప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని వాసిలి, నరసాపురం, వెంకట్రావుపల్లి, ఈ గ్రామాల్లో నేషనల్ హైవే 67 నిర్మించే సమయంలో రైతులకు సంబంధం లేకుండానే రైతుల పొలాలను ఆక్రమించి రోడ్లు నిర్మాణం చేశారని తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించిన రైతులు నేషనల్ హైవే అధికారులను నిలదీసినప్పుడు తరువాత నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఆ ప్రక్రియ నిలిపివేశారన్నారు. ఆ తరువాత కలెక్టర్‌ను, డిఆర్‌ఒను ఎపి రైతు సంఘం తరఫున రైతులు కలిసినప్పుడు 67 నిర్మాణంలో ఏవైతే రైతుల పోగొట్టుకున్నారో దాన్ని సర్వే జరిపి ఎవరెవరి పొలం ఎంత ఉందో, ఎంతెంత పోయిందో సర్వే చేసి నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. ఇచ్చి ఆరు నెలల గడిచినప్పటికీ కూడా నష్టపరిహారం ఇచ్చేందుకు ఏ ప్రక్రియ ప్రారంభం కాలేదని, కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లినా కూడా ఇప్పటికీ ప్రత్యేక గ్రీవెన్స్ డేలో ఇచ్చిన అర్జీకి కూడా ఇంతవరకు సమాధానం ఇవ్వలేదన్నారు. రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవడం సరైన పద్ధతి కాదని, నివేదికలు తెప్పించుకొని నష్టపరిహారం ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎపి రైతుసంఘం అధ్యక్ష కార్యదర్శులు కృష్ణమోహన్, లక్కు కృష్ణప్రసాద్, కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గంటా లక్ష్మీపతి, రైతులు చేవూరు రామకృష్ణారెడ్డి, వెంకటరెడ్డి, సుబ్బరాయుడు, రత్నయ్య, నరసింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.