ప్రజాశక్తి -అనంతగిరి:కొత్తవలస, కేకె లైన్ కిరండోల్ రెండవ రోడ్డు పనుల విస్తరణతో రైతుల జిరాయితి భూమి నష్టానికి గురి చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని స్థానిక జెడ్పిటిసి దీసరి. గంగరాజు హెచ్చరించారు. శనివారం ఎగువశోభ, టోకురు పంచాయతీ గ్రామాల్లో సందర్శించిన రైలు రోడ్డు నిర్మాణంతో కాఫీ, సిల్వర్ ఓక్, పలసయ్య తోటలకు జరుగుతున్న నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పనుల జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. రైల్ రోడ్డు విస్తరణతో పలస తోటలు పూర్తిగా దెబ్బతింటున్నాయని సంబంధిత రైల్వే శాఖ డిఇ వెంకటరాజు, గుత్తేదారుడు కిషోర్ వెంకటేష్ లను గంగరాజు నిలదీశారు.అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు సిల్వర్, కాపీ తోటలను పూర్వకాలం నుండి సాగులో చేస్తున్నారని, అధికారులు తప్పుడు రికార్డులు సృష్టించి రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.
ఎగువశోభ పంచాయతీ పొర్న పదర్ గ్రామానికి చెందిన సొంటరి బీమన్న సర్వే నెంబర్ 21లో 11 ఎకరాల 32 సెంట్లు భూమి ఉందని, అలాగే సాగర సన్యాసికి చెందిన సర్వే నెంబర్ 20లో 8 ఎకరాల 57 సెంట్ల భూమిలో తవ్వకాలు జరిపి మట్టిని కుప్పలుగా వేయడంతో ఇటు భూమి, అటు తోటలు పాడైపోతున్నాయని తెలిపారు. నష్టపోయిన భూముల రైతులను రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు గుర్తించి సర్వేలు నిర్వహించి మరోచోట భూములు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎగువ శోభ సర్పంచ్ కొర్రా సింహాద్రి, సిపిఎం నాయకులు గెమ్మెల దేవన్న, వార్డు మెంబర్ పాంగి లక్ష్మణరావు, రైతులు తదితరులు పాల్గొన్నారు.










