Apr 20,2023 22:45

పోతునూరులో రైతుల నిరసన
            దెందులూరు:ధాన్యం కొనుగోలుకు రైతులకు నాణ్యమైన గోనె సంచులు ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం ఆధ్వర్యంలో రైతులు పోతునూరులో గురువారం నిరసన తెలిపారు. రైతులు చినిగిన గోనె సంచులు పట్టుకుని ఈ సంచుల్లో ధాన్యం నింపేదెలాగని నినదించారు. ఈ సందర్భంగా ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ రైతులకు ఇచ్చే గోనె సంచులలో 40 శాతం చినిగినవి ఉండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నాణ్యమైన గోనె సంచులు ఇవ్వాలని కోరారు. ధాన్యం రవాణాకు లారీలు ఏర్పాటు చేయాలన్నారు. నూక శాతం పేరుతో రైతుల నుండి డబ్బు వసూలు ఆపాలని కోరారు. ధాన్యం కొనుగోలు సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు.