ప్రజాశక్తి - రేపల్లె
రైతులకు మెరుగైన సేవలు అందించాలని జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ అన్నారు. వ్యవసాయ శాఖ, పంచాయతీరాజ్ సిబ్బందితో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలోని క్షేత్రస్థాయి సిబ్బంది సెప్టెంబర్ 30లోపు ఈ పంట నమోదు, ఈకేవైసీ 100శాతం పూర్తి చేయాలన్నారు. పీఎం కిసాన్ నగదు బదిలీకి సంబంధించి రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలని అన్నారు. ఈకేవైసీ చేయించుకోకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్ రూ.2వేల నగదు ఖాతాలో జమ కాదని అన్నారు. ఖరీఫ్ 2023 సంబంధించి పంట నమోదు చేయించుకున్న రైతులు తమ పంట నమోదు రసీదు ఒకటి రెండు రోజుల్లో ఆర్‌బికెలో అందుబాటులో ఉంటుందన్నారు. పంట నమోదు రసీదు అనేది వరి ధాన్యం కొనుగోలు, ఇతర పంట నష్ట పరిహారం, పంట భీమాకు అన్ని విధాల ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడిఏ సయ్యద్ అక్తర్ హుస్సేన్, ఎఒ వాగోలు బుష్, ఎంపీడీవో శివపార్వతి, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.










