Nov 20,2023 21:56

మాట్లాడుతున్న మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

ప్రజాశక్తి-నెల్లూరు :రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతులకు విస్తత సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రతి నియోజకవర్గానికి ఓ మార్కెట్‌ కమిటీని ఏర్పాటుచేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికే దక్కుతుందని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమ వారం నగరంలోని ఓ ప్రముఖ కళ్యాణ మండపంలో నిర్వహించిన నెల్లూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు సులభతర సేవలందిం చడమే లక్ష్యంగా మార్కెటింగ్‌ శాఖలో సరికొత్త విధానాలకు శ్రీకారం చుడుతున్నామన్నారు. సంఘ బంధాల తరహాలో రైతు ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ కేంద్రాల ద్వారా రైతు పండించిన పంటలను ఇంటి నుంచే విక్రయించేలా ఈ-ఫామ్‌ సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉంటూ మంచి వ్యక్తిగా గుర్తింపు పొందిన పేర్నాటి కోటేశ్వర్‌ రెడ్డి వ్యవసాయ కమిటీ చైర్మన్‌ గా రైతులకు మంచి సేవలు అందించాలని మంత్రి ఈ సందర్భంగా ఆకాంక్షించారు.ఎంపి ఆదాల ప్రభాకర్‌ రెడ్డి మాట్లా డుతూ రైతులకు మెరుగైన సేవలు సకాలం అందించేందుకు నెల్లూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. అనంతరం నెల్లూరు ఏఎంసీ చైర్మన్‌ గా పేర్నాటి కోటేశ్వర్‌ రెడ్డి, వైస్‌ చైర్మన్‌ గా ఒట్టూరు సుధాకర్‌ యాదవ్‌, పలువురు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఎంఎల్‌సి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, మేయర్‌ స్రవంతి జయ వర్థన్‌, విజయ డెయిరీ చైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి, మార్కెటింగ్‌ శాఖ ఎడి అనిత ఉన్నారు.