Aug 25,2023 21:26

సమావేశంలో మాట్లాడుతున్న వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ నాగేశ్వరరావు

పార్వతీపురం: వ్యవసాయ సలహా మండలిలో రైతులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వానికి నివేదించాలని జిల్లా వ్యవసాయ సలహామండలి అధ్యక్షులు వాకాడ నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో జాయింటు కలెక్టరు ఆర్‌.గోవిందరావు అధ్యక్షతన జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వ పథకాలు, ప్రకృతి వైపరీత్యాల్లో నష్టపరిహారం పొందేందుకు, పంటను అమ్ముకొనేందుకు ప్రతిరైతు తప్పని సరిగా ఇ-పంట నమోదు చేయించుకోవాలని తెలిపారు. రైతుభరోసా కేంద్రాల స్థాయి, మండల స్థాయి సలహా మండలి సమావేశాలకు సంబంధిత శాఖల అదికారులు హాజరుకావాలన్నారు. జెసి గోవిందరావు మాట్లాడుతూ ఈ ఏడాది ధాన్యం కొనుగోలుకు లక్ష్యం లేదని, రైతు పండించే ప్రతి గింజ కొనుగోలు చేస్తామని, రైతులు తమ పంటను అమ్ముకొనేందుకు తప్పని సరిగా ఇ-పంట నమోదు చేయించుకోవాలని తెలిపారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశాలకు సభ్యులుగా జిల్లా స్థాయి అధికారులంతా తప్పని సరిగా హాజరుకావాలని అన్నారు. నెలలో మొదటి శుక్రవారంలో ఆర్‌బికెల కేంద్రాల స్థాయిలోనూ, రెండో శుక్రవారం మండల స్థాయిలో జరిగే సలహా మండలి సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను, తీర్మానాలను తప్పని సరిగా పంపించాలని, వాటిని జిల్లా స్థాయిలో అమలు చేయగలిగినవి చేసి, మిగిలిన వాటిని పరిష్కారం నిమిత్తం ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. నీటి పారుదల శాఖ పంటలకు సకాలంలో నీరు విడుదలకు ప్రణాళిక సిద్దం చేసుకోవాలని, ప్రోజెక్టుల నుండి నీటి విడుదల సమాచారాన్ని జిల్లావ్యవసాయ సలహామండలి చైర్మన్‌, సభ్యులకు ముందస్తుగా అందించాలని తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి రాబర్ట్‌ పాల్‌ వ్యవసాయ, అనుబంధశాఖల నివేదిక సమర్పిస్తూ జిల్లాలో గుమ్మలక్ష్మీపురం మండలం మినహా మిగిలిన మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైందన్నారు. జిల్లాలో లక్షా 77 ఎకరాల వరి సాగు లక్ష్యంగా 25వేల క్వింటాలు విత్తనాలు పంపిణీ చేశామన్నారు. ప్రస్తుతానికి లక్షా 13వేల ఎకరాల్లో నాట్లు పూర్తయినాయని, ఈ నెలాఖరుకు లక్ష్యం మేరకు వరినాట్లు పూర్తవుతాయని తెలిపారు. జిల్లాకు 45వేల మెట్రిక్‌ టన్నులు ఎరువులు కేటాయించగా 34 మెట్రక్‌ టన్నులు జిల్లాకు వచ్చాయని, 24 వేల మెట్రిక్‌ టన్నులు పంపిణీ జరిగిందని, 9వేల టన్నుల ఎరువులు నిల్వ ఉన్నాయని, ఎరువులు పొందని రైతులు వెంటనే వారి ఆర్‌బికెల ద్వారా పొందాలని తెలిపారు. మండలాల్లో జరిగిన సలహామండలి సమావేశాల్లో వ్యక్తిగత పనిముట్లు సరఫరా చేయాలని, ధాన్యం సేకరణలో దగ్గర మిల్లులకు జియోట్యాగింగ్‌ చేయాలని, ఆర్‌బికె భవనాల నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలని, వ్యవసాయ యాంత్రీకరణకు వ్యక్తిగతంగా పరికరాలు సరఫరా చేయాలని, సూక్ష్మపోషకాలు, టార్పాలిన్లు, బిందుసేద్య పరికరాలు, గడ్డి విత్తనాలు సరఫరా చేయాలనికోరుతూ తీర్మానాలు చేసి పంపించారని, తీర్మానాలకు అనుగుణంగా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వం ప్రోత్సాహాన్నిస్తున్నదని, పంట నమోదులో ప్రకృతి పంటను విడిగా నమోదు చేస్తున్నారని తెలిపారు. గ్రామ స్థాయి సమావేశాలకు సభ్యులంతా హాజరుకావాలని, చెరువుల్లో ఆక్రమణలు తొలగించి ఆయకట్టు భూములకు నీరందించాలని, ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత కల్పించాలని, ఐటిడిఎ పరిధిలో పండించే పంటలను అమ్ముకొనేందుకు విశాఖపట్నం రైతుబజార్లలో స్టాల్‌ను కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని సభ్యులను కోరారు. సమావేశంలో సభ్యులు పారినాయుడు, ఎస్‌.జనార్థనరావు, నరశింహమూర్తి, డిసిఒ సన్యాసినాయుడు, జిల్లా ఉద్యానఅధికారి సత్యనారాయణరెడ్డి, జిల్లా మత్స్యశాఖఅధికారి తిరుపతయ్య, ఇతర శాఖల అదికారులు పాల్గొన్నారు.