Nov 03,2023 23:12

ప్రజాశక్తి-మండపేట
ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు సిబ్బందివారికి వారి విధులకు అనుగుణంగా పనిచేయాలని, రైతులకు ఎటువంటి సమస్యలు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను అందే విధంగా చూడాలని మండల వ్యవసాయ అధికారి కె.ప్రభాకర్‌ పేర్కొన్నారు. రాయవరం మండలంలోని రైతు భరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలుపై టెక్నికల్‌ అసిస్టెంట్లకు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు, హెల్పర్లకు, గ్రామ వ్యవసాయ సహాయకులకు గ్రామ రెవెన్యూ అధికారులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు మండల వ్యవసాయ అధికారి కె.ప్రభాకర్‌ శుక్రవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ మండలంలో 14643 ఎకరాలలో వరి పంటను వేయడం జరిగిందని 19 రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. సాధారణ రకమునకు 75 కేజీలు బస్తాకు 1637, సన్న రకాలకు (ఎ గ్రేడ్‌)కు రూ.1652గా మద్దతు ధరగా నిర్ణయించడం జరిగినది. టెక్నికల్‌ అసిస్టెంట్లు విధి ప్రకారంగా ధాన్యం శాంపిలను సేకరించడం, వాటి యొక్క నాణ్యత ప్రమాణాలను చూసి నాణ్యత ప్రమాణాలకు లోబడి ఉన్నట్లయితే వాటిని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు కొనుగోలు చేసే విధంగా చేయాలన్నారు. నాణ్యత ప్రమాణాల ఏ విధంగా చూడాలనే దానిపై సివిల్‌ సప్లైస్‌ సంబంధించి టెక్నికల్‌ అసిస్టెంట్‌ శివ కృష్ణ వివరించారు. తహశీల్దార్‌ ప్రకాష్‌ బాబు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వ్యవసాయ, రెవెన్యూ, కోపరేటివ్‌ శాఖ, పౌర సరఫరాల శాఖలకు సంబంధించిన సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. గ్రామ రెవెన్యూ అధికారులు రైస్‌మిల్‌ కు వచ్చిన ధాన్యం లోడును వెంటనే అన్లోడ్‌ అవే విధంగా చూడాలని, లాగిన్‌ లో అప్రూవల్‌ చేసి మిల్లర్‌ చేకూడా వచ్చిన ధాన్యానికి ఎకనాలజిమెంట్‌ చేయించాలన్నారు.