Jul 31,2022 23:23

ఇళ్లు అప్పగించాలని నిరసన తెలుపుతున్న రైతులు

ప్రజాశక్తి- పిఎం.పాలెం : కొమ్మాది, బక్కన్నపాలెం, రేవల్లపాలెం రైతులకు న్యాయం జరిగే వరకూ వారి పోరాటానికి మద్దతుగా నిలబడతామని ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం జవహర్‌ నవోదయ విద్యాలయం వద్ద నిర్మించిన హూదూద్‌ ఇళ్ల వద్ద నిరసన చేపట్టారు. సిఐటియు మధురవాడ జోన్‌ ప్రధాన కార్యదర్శి పి.రాజుకుమార్‌, వివేకానంద కాలనీ, బాపూజీ నగర్‌ కాలనీల నుంచి ఎస్‌.రామప్పడు, జి.కిరణ్‌, డి.రవికుమార్‌ పాల్గొని మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా రాజుకుమార్‌ మాట్లాడుతూ, ప్రభుత్వం బలవంతంగా భూములు తీసుకొని, ఇస్తామన్న ఇల్లు కూడా ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. సిపిఎం జోన్‌ కార్యదర్శి డి.అప్పలరాజు మాట్లాడుతూ, పేదలు, దళితుల పట్ల స్థానిక తహశీల్దారు, ఎపి స్టేట్‌ హౌసింగ్‌ కార్పోరేషన్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. రైతులకు మద్దతుగా ప్రజా సంఘాల తరుపున పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విశాఖ రూరల్‌ తహశీల్దారు కార్యాలయం వద్ద ఇళ్లు అప్పజెప్పే వరకు నిరవధిక ఆందోళన, రిలే నిరాహారదీక్షలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జోన్‌ కార్యకర్తలు కె.నాగరాజు, ఎస్‌.పైడితల్లి, ఎస్‌.శంకర్‌, ఎస్‌.నాగరాజు, పిల్ల అప్పలనరసమ్మ, చిన్నమ్మలు, ఎస్‌.నరసియ్యమ్మ, పి.అంకయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.