Oct 08,2023 21:18

జిల్లా వ్యవసాయ శాఖాధికారి విటి రామారావు

ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి : జిల్లాలోని రైతులంతా ఇ-కెవైసి తప్పనిసరిగా చేయించుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విటి రామారావు కోరారు. ఇకెవైసితో ప్రభుత్వ పథకాలన్నీ ముడిపడి ఉంటాయని స్పష్టంచేశారు. జిల్లాలో వరి పంట ఆశాజనకంగా ఉందన్నారు. జిల్లాలో యూరియా సహా అన్ని రకాల ఎరువులూ అందుబాటులో ఉన్నాయని వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 17మంది యువ రైతులను ఎంపిక చేసి డ్రోన్‌ పైలెట్‌ శిక్షణకు పంపామన్నారు. ఈ వారం తనను కలిసిన ప్రజాశక్తికి ఆయన ముఖాముఖీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ వివరాలు..


ఇకెవైసి ప్రాధాన్యత ఏమిటి.?
పంటల బీమా, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, రైతు భరోసా వంటి పథకాలు సహా రైతుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు ఇకెవైసి తప్పనిసరి. ఈ నేపథ్యంలో రైతులు ఆర్‌బికెలకు వచ్చి ఇకెవైసి నమోదు చేయించుకోవాలని కోరుతున్నాం. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే ఇకెవైసి వెబ్‌సైట్‌ అందుబాటులో ఉంటుంది.


ఇ-క్రాప్‌, ఇకెవైసి ప్రక్రియలు ఎంత వరకు వచ్చాయి.?
ఇ-క్రాప్‌ నమోదు దాదాపు పూర్తి కావస్తోంది. ఇప్పటి వరకు అన్ని పంటలూ కలుపుకుని 99 శాతం అయింది. ఇందులో రైతుల ఇకెవైసి నమోదు తప్పనిసరి. ఇది ఇప్పటి వరకు 71శాతం వరకు వచ్చింది. ఆర్‌బికెల ద్వారా ఈ నమోదు ప్రక్రియ వేగవంతం చేస్తున్నాం. ఇందుకు రైతులు కూడా సమయం కేటాయించి మాకు సహకరించాలి. సిబ్బంది సాంకేతిక సమస్యలను అధిగమించి పనిచేయాలి.


ఈ ఏడాది వరి పంట ఎలా ఉంది.?
ఈ ఏడాది వరి పంట ఆశాజనకంగానే ఉంది. ప్రస్తుతం రాజాం, బొబ్బిలి తదితర ప్రాంతాల్లో వరి పొట్టదశకు చేరింది. మిగిలిన ప్రాంతాల్లో చాలా వరకు అంకర దశలో ఉంది. ఆలస్యంగా నాట్లుపడిన చోట్ల వరిచేను దుబ్బుచేస్తోంది. ఈ సమయంలో వరికి నీరు ఎక్కువగా అవసరం. వరుణుడు కరుణిస్తే అన్నదాతకు అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదనడంలో సందేహం లేదు.


వరి సాగు విస్తీర్ణం ఎంత మేర జరిగింది.?
దాదాపు లక్ష్యానికి అనుగుణంగానే వరిసాగు విస్తీర్ణం కనిపిస్తోంది. ఈ ఏడాది 2,25,637 ఎకరాలు సాధారణ విస్తీర్ణం కాగా, 2,24,632 ఎకరాల మేర సాగైంది. దాదాపు 99శాతం సాగైనట్టు లెక్క. వర్షాభావ పరిస్థితుల వల్ల ఆ ఒక్క శాతమైనా తగ్గింది. ప్రస్తుతం వరి ఆశాజనకంగానే ఉంది. యాజమాన్య పద్ధతుల్లో మెలకువలు పాటిస్తే మంచి దిగుబడి వచ్చే అవకాశాలు కూడా మెండుగానే ఉన్నాయి.


ఎరువులు సరఫరా ఎలా ఉంది.?
ఎరువులు పుష్కలంగా ఉన్నాయి. మన జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి అన్ని పంటలకూ కలుపుకుని యూరియా, డిఎపి, పొటాష్‌, తదితర కాంప్లెక్స్‌ ఎరువులు కలుపుకుని 21 వేల మెట్రిక్‌ టన్నులు అవసరం కాగా, ఇప్పటి వరకు 27 వేల మెట్రిక్‌ టన్నుల మేర జిల్లాకు చేరాయి. ఇందులో ఆర్‌బికెల ద్వారా సగం, ప్రయివేటు దుకాణాల ద్వారా సగం విక్రయిస్తున్నాం.


ఎన్ని ఆర్‌బికెల్లో ఎరువులు ఉన్నాయి.?
జిల్లా వ్యాప్తంగా 494 ఆర్‌బికెల ద్వారా ఎరువులు విక్రయానికి పెట్టాం. ప్రస్తుతం 120 ఆర్‌బికెల్లోనే ఉన్నాయి. మిగిలిన చోట్ల విక్రయా లు పూర్తయ్యాయి. ఎక్కడికైనా ఇంకా అవసర మైతే వెంటనే పంపేందుకు చర్యలు తీసుకుంటు న్నాం. శనివారం సుమారు 700 మెట్రిక్‌ టన్నుల మేర ఎరువులు జిల్లాకు చేరాయి.


జిల్లాలో డ్రోన్ల వినియోగ ప్రయత్నం ఎంత వరకు వచ్చింది.?
వ్యవసాయ రంగంలో అనేక మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఎరువులను కూడా డ్రోన్‌ సిస్టమ్‌ ద్వారా పంటలకు వేసేందుకు ప్రభుత్వం తలపెట్టింది. ఇందులో భాగంగా మండలానికీ ఒక డ్రోన్‌ సబ్సిడీపై మంజూరు చేయాలని నిర్ణయించింది. దీన్ని ఆపరేట్‌ చేసేందుకు తొలుత పైలెట్లను తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు మన జిల్లా నుంచి 17 మండలాలకు చెందిన యువ రైతులు డ్రోన్‌ పైలెట్‌ శిక్షణకు వెళ్లారు. మిగిలిన మండలాల నుంచి కూడా పంపే ప్రయత్నం చేస్తున్నాం.