ముదినేపల్లి సర్వసభ్య సమావేశంలో ఎంపిపి సత్యనారాయణ
ప్రజాశక్తి - ముదినేపల్లి
రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ధాన్యం కొనుగోలు చేయాలని ఎంపిపి రామిశెట్టి సత్యనారాయణ కోరారు. ముదినేపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం ఎంపిపి రామిశెట్టి సత్యనారాయణ అధ్యక్షతన మండల పరిషత్ సమావేశపు హాలులో నిర్వహించారు. ఈ సందర్భంగా రామిశెట్టి మాట్లాడుతూ రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు వేగవంతంగా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, రైతులు ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతుల ధాన్యం తేమ శాతం 17 పైగా ఉన్నా కొనుగోలు చేస్తామన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తల్త్తెకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను అదేశించారు. అనంతరం జలవనరుల శాఖ ఎఇ సిద్ధార్ధ మాట్లాడుతూ రెండో పంట దాళ్వా రద్దు చేయడం జరిగిందన్నారు. రైతులు ఎవరూ దాళ్వా పంటకు సన్నద్ధం కారాదన్నారు. డిసెంబర్ ఐదో తేదీ వరకు మాత్రమే పంట కాల్వలకు నీరు వస్తుందని, అనంతరం కాల్వలకు నిలిచిపోతోందన్నారు. ఈ లోగా సర్పంచులు తమ గ్రామాల్లోని మంచినీటి చెరువులను పూర్తి స్థాయిలో నింపుకోవాలని కోరారు. వ్యవసాయశాఖ అధికారి బొర్రా మాధవ్ మాట్లాడుతూ మండలంలో 15వేల ఎకరాల్లో సార్వా వరి సాగు రైతులు చేశారని, 900పై చిలుకు ఎకరాల్లో వరికోతలు పూర్తయ్యాయని తెలిపారు. ఇప్పటి వరకు 574 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు. తహాశీల్దార్ కె.శ్రీనివాస్ మాట్లాడుతూ మండలంలో జరుగుతున్న భూరీసర్వేకు రైతులంతా సహకరించాలన్నారు. రైతులు వారి భూ సరిహద్దులు చూపించి సర్వేకు అవసరమైన ఆధార్, సంబంధిత పత్రాలు గ్రామ విఆర్‌ఒ, లేక సర్వేయర్‌కు అందించాలన్నారు. ముదినేపల్లి గ్రామ సర్పంచి నిమ్మగడ్డ కైకమ్మ మాట్లాడుతూ అన్నవరం జగనన్న లేఆవుట్‌లో రహదారి సౌకర్యం సరిగాలేని కారణంగా లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు చేసేందుకు ముందుకు రావడంలేదన్నారు. వెంటనే రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎంపిపిని కోరారు. దీనిపై ఎంపిపి స్పందిస్తూ వర్షాల కారణంగా రోడ్లు సరిగాలేవని, సమస్య పరిష్కారిస్తామన్నారు. పేరూరు సర్పంచి మాట్లాడుతూ పొల్‌రాజ్ డ్రైయిన్‌పై పడిపోయిన వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. మండలంలోని వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనులు, పెండింగ్‌లో ఉన్న పనులపై సభలో చర్చించారు. ఈ సమావేశంలో జెడ్‌పిటిసి సభ్యులు ఈడే వెంకటేశ్వరమ్మ, ఎంపిడిఒ పి.మల్లీవ్వరి, వైస్ ఎంపిపిలు సునీత, రాధా, డైరెక్టర్ గంటా సంధ్య, విద్యుత్ శాఖ ఎఇ పి.రవికుమార్ వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు పాల్గొన్నారు.










