Jun 13,2023 20:20

రైతు మేకల కోదండకు ఆర్థికసాయం అందిస్తున్న గుమ్మనూరు నారాయణ

ప్రజాశక్తి - చిప్పగిరి
రైతులకు ఏ సమస్య రాకుండా చూసుకోవాలన్నదే జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని ఆలూరు మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ గుమ్మనూరు నారాయణ తెలిపారు. గత వారంలో దౌల్తాపురం గ్రామంలో మేకల కోదండకు చెందిన రెండు వృషభాలు పాముకాటు వల్ల మృతి చెందాయి. మంగళవారం గుమ్మనూరు గ్రామంలో బాధిత రైతు ఇంటి దగ్గర కలిశారు. బాధిత రైతును ఆదుకోవాలని పశు వైద్యాధికారులతో మాట్లాడి, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం సహకారంతో నష్టపరిహారం వచ్చేలా కృషి చేస్తానని, తనవంతు సహాయం అందజేస్తానని రైతుకు భరోసా కల్పిస్తూ రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పొద్దు పొడిస్తే వృషభాల దగ్గరకు వెళ్లే ఏ రైతుకైనా అలా జరిగితే ఎంత బాధ పడతారో తమకు తెలుసన్నారు. రైతు కన్నీళ్లు పెట్టకూడదని, ఉన్నదాంట్లో ఏ ఒక్క రైతునైనా ఆదుకోవడం మనిషి నైజమన్నారు. శ్రీధర్‌, షేకన్న, వాలంటీరు తిమ్మప్ప, నెట్టికంటి, అంజి, కొండ సుంకన్న, రాజశేఖర్‌, పెద్ద నెట్టికంటి పాల్గొన్నారు.