May 06,2023 21:47

అకాల వర్షాలకు పడిపోయిన వరి పేర్లను పరిశీలిస్తున్న కోన శశిధర్‌ జిల్లా కలెక్టర్‌ సామూన్‌


రైతులకు భరోసా కల్పించాలి
ఐటి అండ్‌ సి శాఖ కార్యదర్శి కోన శశిధర్‌
- దెబ్బతిన్న పంటలను ఐటి అండ్‌ సి శాఖ కార్యదర్శి, కలెక్టర్‌ పరిశీలన
ప్రజాశక్తి - బండి ఆత్మకూర్‌

       అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు భరోసా కల్పించాలని, అది అధికారుల బాధ్యతని ఐటి అండ్‌ సి శాఖ కార్యదర్శి కోనా శశిధర్‌ తెలిపారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు మండలంలోని జిసి పాలెం, జి.లింగాపురం, రామాపురం, సంత జుటూరు, చిన్నదేవలాపురం గ్రామాల్లో దెబ్బతిన్న వరి పంట పొలాలను ఐటి అండ్‌ సి శాఖ కార్యదర్శి కోనా శశిధర్‌, జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌లు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు రైతన్నలను ఆదుకునేందుకు నష్టపోయిన పొలాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. నష్టపోయిన ప్రతి రైతును గుర్తించి నివేదికలు తయారు చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి రైతు పొలం వద్దకు వెళ్లి వివరాలు సేకరించాలని సూచించారు. నారాయణపురం గ్రామంలోనే 650 హెక్టార్లలో వరి పంట నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక నివేదిక తయారు చేశారన్నారు. నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. అలాగే రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు, రసాయన ఎరువులు రైతులకు అందించనున్నట్లు చెప్పారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు అనంతరం వారు నారాయణపురం గ్రామంలోని రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించారు. మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారులు వెంటనే పరిష్కరించాలన్నారు. రైతు భరోసా కేంద్రాలు పకడ్బందీగా పని చేయాలని, వ్యవసాయ శాఖ సిబ్బంది వారి పరిధిలోని గ్రామాల్లో నివేదికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ టి.నిశాంతి, జిల్లా వ్యవసాయ అధికారి మోహన్‌రావు, ఎంపిడిఒ వాసుదేవ గుప్తా, వెలుగు ఎపిఎం రాజశేఖర్‌ రెడ్డి, సర్పంచి ఎండూరు సరిత, అధికారులు, రైతులు పాల్గొన్నారు.