
ప్రజాశక్తి - మార్టూరు రూరల్
తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని వ్యవసాయశాఖ డిప్యూటీ డైరెక్టర్ విజయ నిర్మల తెలిపారు. ప్రకాశం జిల్లా ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు గురువారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. రైతులు రబి సీజన్ నందు ఎక్కువుగా మొక్కజొన్న, వరి సాగు చేస్తారని అన్నారు. ఈ ఏడాది సాగర్ నీరు అందుబాటులో లేకపోవడంతో సాగుచేయలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. రైతులు నష్టపోకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని కోరారు. నల్ల రేగడ భూముల్లో సెనగ పంట సాగుచేసుకోవటం ద్వారా రైతులు మంచి దిగుబడులు సాధించవచ్చని అన్నారు. నంద్యాల రీసెర్చ్ స్టేషన్ ద్వారా లభించే ఎన్‌బిఇజి-47, ఎన్‌బిఇజి-49 రకం విత్తనాలు వినియోగించడం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చని అన్నారు. శాస్త్రవేత్త మృదుల మాట్లాడుతూ తేలికపాటి నేలలో మినుము, పెసర, ఉలవలు, జొన్నలు, సొయా చిక్కుడు సాగు చేసుకోవచ్చని అన్నారు. రైతులకు రాయితీపై తైవాన్ స్ప్రేయర్స్, బిందు సేద్యం, చిన్న ట్రాక్టర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కావాల్సిన రైతులు మార్టూరు ఉద్యాన కార్యాలయంలో సంప్రదించాలని ఉద్యానశాఖ అధికారి జెన్నమ్మ సూచించారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ఎడి పద్మావతి, మార్టూరు, బల్లికురవ ఎఒలు వీరగంధం కిరణ్ కుమార్, కుమారి, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పెంటల సత్యనారాయణ పాల్గొన్నారు.