ప్రజాశక్తి-శింగనమల రైతులకు 9 గంటల నిరంతర, నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి భాస్కర్ డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని తరిమెల గ్రామంలో ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్ ముందు రైతుసంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనవ మాట్లాడుతూ మండలంలో వారం రోజుల నుంచి రోజుకు 4 నుంచి 5 గంటలు మాత్రమే రైతులకు కరెంటు సరఫరా చేస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ సర్‌ఛార్జీల పేరుతో రైతు, పేదల నడ్డి విరుస్తున్నాయన్నారు. ముఖ్యంగా రానున్న స్మార్ట్ మీటర్లతో సామాన్యులకు మరో ముప్పు పొంచి ఉందన్నారు. కార్పొరేట్ జేబులను నింపేందుకు 40 పైసలు కలిపి యూనిట్‌కు 20 పైసలు చొప్పున జనం నెత్తిన బండ వేస్తున్నారన్నారు. రాజకీయ అవినీతిపరులు, కార్పొరేట్లు కుమ్మక్కై రూ.2 నుంచి రూ.3కు కొనాల్సిన విద్యుత్‌ను బహిరంగ మార్కెట్‌లో రూ.10 నుంచి రూ.20కి కింటున్నారన్నారు. ఇటీవల నిబంధనలకు విరుద్ధంగా హిందుజా సంస్థకు రూ.1,200 కోట్ల అప్పనంగా చెల్లించడమే ఇందుకు నిదర్శమన్నారు. స్మార్ట్ మీటర్లు వస్తే చిన్న బల్బులు రీడింగ్‌లోకి వస్తాయన్నారు. తద్వారా డబ్బు చెల్లించి సెల్‌ఫోన్ మాదిరిగా ఫ్రీ ఫెయిర్ పద్ధతి కూడా వస్తుందని హెచ్చరించారు. అంతేగాకుండా రాత్రిపూట ఎక్కువ రేటు ఉండే ప్రమాదం పొంచి ఉందన్నారు. కావున ప్రతి ఒక్కరూ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణరెడ్డి, సుంకన్న, ఖాదర్‌వలి, లక్ష్మీనారాయణ, సాయినాథ్‌రెడ్డి, ఆంజనేయులు, రామాంజనేయులు, రమేష్, శ్రీనివాసులు, మేకల పెద్దన్న, ఆంజనేయులు, లక్ష్మీనారాయణ, నాగరాజు, చెంగల్ ధనుంజయ, వెంకట్‌నారాయణ, రాముడు, కుళ్లాయిస్వామి, గంపన్న, పెద్ద ఆంజనేయులు, అప్పా రాజు, దొడ్ల అయ్యప్ప, రామదాసు, రాముడు, తదితరులు పాల్గొన్నారు.
తరిమెల సబ్‌స్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న వ్యకాసం, రైతుసంఘం నాయకులు










