Sep 04,2023 22:05

ఆందోళనలో పాల్గొన్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి బత్తలపల్లి : రైతు ప్రభుత్వమని రైతులకు నాణ్యమైన కరెంటు ఇచ్చి ఆదుకుంటామంటూ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం రైతాంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందని టిడిపి నాయకులు విమర్శించారు. ఈ మేరకు టిడిపి నాయకులు ఆపార్టీ మండల కన్వీనర్‌ గోనుగుంట్ల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి సబ్‌ స్టేషన్‌ వరకు ర్యాలీగా వెళ్లి జాతీయ రహదారిపై బైటాయించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆగస్టు నెలలో రైతులు వరి నాట్లు వేయాల్సి ఉండగా కరెంటు కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. రైతులకు 24 గంటలు నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఎఇకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సురేంద్ర నాయుడు, నెట్టెం రమణ, బోయపాటి అప్ప స్వామి నాయుడు, చల్లా శ్రీనివాసులు, కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.