రెండు గ్రామాల మధ్య ఉండే బ్రిడ్జే అక్కడి రైతులకు ఆధారం. వ్యవసాయ పనులు చేసుకోవాలంటే ఆ బ్రిడ్జి దాటుకునే వెళ్లాలి. కానీ 2018లో వరద బీభత్సంలో ఆ బ్రిడ్జి కొట్టుకుపోయింది. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. రైతంటే అన్నం పెట్టడమే కాదు, అద్భుతమైన ఆలోచనలు చేయగలడని నిరూపించారు. రైతులే సొంతంగా హ్యాంగింగ్ బ్రిడ్జిని తయారుచేసి శభాష్ అనిపించుకుంటున్నారు. అది మరెక్కడో కాదు మన పశ్చిమ గోదావరి జిల్లాలోనే. సొంతంగా బ్రిడ్జి నిర్మించాలనే ఆలోచన రైతులకెలా వచ్చిందంటే...
పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలం వీరపాలెం - త్యాజంపూడి గ్రామాల మధ్య ఎర్రకాలువ ఉంది. ఆ కాలువ అవతలివైపు తొమ్మిది వందల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఆ రెండు గ్రామాల ప్రజలు వ్యవసాయ పనులకు, పశువులకు మేతకోసమూ కాలువ అవతలికి వెళ్లాల్సిందే. సాధారణంగా ఈ కాలువ నీటి ప్రవాహం చాలా వేగంగా ఉంటుంది. గతంలో కొందరు ఈ కాలువ దాటుతూ ప్రాణాలు సైతం కోల్పోయారు. అంతేకాదు అప్పుడప్పుడు ఎర్రకాలువ పొంగి, గట్లు తెగి పొలాలను ఇసుక కప్పేయడంతో రైతులు చాలా నష్టపోతుండేవారు. వ్యవసాయ పనులకు వెళ్లిన రైతులు ఇళ్లకు తిరిగి వచ్చేవరకూ ఇళ్లలోనివారు అరచేతిలో ప్రాణాలను పెట్టుకుని, ఎదురుచూసేవారు. కొన్నేళ్ల క్రితం ప్రభుత్వం అక్కడ బ్రిడ్జిని నిర్మించింది. ఆ బ్రిడ్జినే 2018 నాటి భారీ వరదల్లో కొట్టుకుపోయింది. అంతే రైతుల పరిస్థితి మరలా మొదటికి వచ్చింది.
ఆలోచన వారిదే..
వరదల్లో కొట్టుకుపోయిన ఎర్రకాలువ బ్రిడ్జిని పునర్న్మించమని రెండున్నరేళ్లగా రైతులు అధికారులు, రాజకీయ నాయకుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. అయినా ఎలాంటి ప్రయోజనం లేదు. విసిగి వేసారిన రైతులు ఎవరి మీదా ఆధారపడకుండా తామే బ్రిడ్జిని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఎన్నో చర్చల తర్వాత సిమెంటు, ఇసుక, కంకరతో కాకుండా హ్యాంగింగ్ బ్రిడ్జిని నిర్మించాలని అనుకున్నారు. అందుకుగాను అవసరమైన ఆర్థిక వనరును రైతులే సమకూర్చుకున్నారు. నాణ్యమైన వైర్‌లతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. పై నుంచి నడిస్తే కిందపడిపోకుండా ఐరన్ మెష్‌లూ ఏర్పాటు చేశారు. ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ సహాయంతో రైతులే ఇంజనీర్లుగా మారి, ఈ మధ్యే బ్రిడ్జి నిర్మాణం పూర్తిచేశారు. కానీ ఇది శాశ్వత పరిష్కారం కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తాము తాత్కాలికంగానే సమస్య నుంచి బయటపడ్డామని.. వర్షాలు, వరదలు వస్తే హ్యాంగింగ్ వంతెనపై రాకపోకలు సాగించటం ఇబ్బందని అంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి, శాశ్వత పరిష్కారంగా బ్రిడ్జిని నిర్మించాలని ఆ రైతులు కోరుతున్నారు.