కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ శాసనాలను రద్దు చేయాలంటూ రైతులు స్వాతంత్య్రానంతరం ఎన్నడూ లేని విధంగా చారిత్రాత్మక ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. తమ డిమాండ్ల సాధనకు వారు సాగిస్తున్న పోరు ముళ్ల బాట అని తెలిసి కూడా...అలుపెరుగకుండా రెండు నెలలకు పైగా దేశ రాజధాని సరిహద్దుల్లో ఆందోళనలనూ చేపడుతున్నారు. చట్టాల రద్దుతో పాటు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలంటూ కేంద్రంతో జరిపిన 11 దఫాల చర్చలు సఫలీకృతం కాలేదు. దీంతో సంయుక్త కిసాన్ మోర్చా నేతృత్వం లోని రైతు సంఘాలు గణతంత్ర దినోత్సవం రోజున ట్రాక్టర్ ర్యాలీకి పిలుపునిచ్చాయి. అయితే తొలుత కేంద్రం దీనిపై అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లగా..ఇది ఢిల్లీ పోలీసుల సమస్యగా పేర్కొంది. ఆ తర్వాత ఢిల్లీ పోలీసులు కూడా శాంతియుత నిరసనలకు అనుమతినివ్వడంతో (దురుద్దేశం!) రైతు సంఘాలు తమ గళాన్ని కేంద్రానికి వినిపించేందుకు సిద్ధమయ్యాయి. ఈ నిరసనలు సజావుగా సాగుతాయని రైతులు భావించారు. కానీ ఆ తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనలు పోలీసుల తీరుపై పలు అనుమానాలు రెకేత్తిస్తున్నాయి.
గణతంత్ర దినోత్సవాన కుతంత్రం
ఆ రోజున రైతులు... ఢిల్లీ సరిహద్దుల నుండి ట్రాక్టర్ ర్యాలీకి సిద్ధమయ్యారు. జాతీయ జెండాలను ట్రాక్టర్లకు కట్టుకుని ...నిర్దేశించిన మార్గాల్లో తమ ఆందోళనను శాంతియుతంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకున్నారు. అయితే ఈ నిరసనలను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని ముందు నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్న రైతు సంఘాలకు దీప్ సిద్ధు రూపంలో బహిర్గతమైంది. పంజాబీ నటుడు సిద్ధు ..గతంలో బిజెపి గణంతో పనిచేసిన అనుభవం ఉంది. ప్రధాని మోడీతో, బిజెపి నేత సన్నీడియోల్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి. కేంద్రంతో జరిపిన చర్చల్లో ఎప్పుడూ పాల్గొనని సిద్ధు...జనవరి 25న సరిహద్దులకు చేరుకుని...తన బృందంతో అనుకున్న మార్గం నుండి కాకుండా మరో మార్గం గుండా నిరసనలు చేపట్టాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. అందుకే 40 రైతు సంఘాల సమన్వయ కమిటీ అతడిని దూరం పెట్టింది. అయినప్పటికీ దీప్ బృందం అనుకున్న సమయానికి ముందే సరిహద్దులకు చేరుకుని...ఎర్రకోటపై దాడే లక్ష్యంగా ముందుకు సాగింది. దీప్ సిద్ధు తప్పుడు మార్గంలో బృందాన్ని నడిపిస్తూ...ఎరక్రోటపై మత పరమైన జెండాను ఎగురవేసేంత వరకు దుశ్చర్య సాగింది. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికలో సైతం తన చర్యను సమర్థించుకున్నాడు. ఈ మొత్తం దేశీయ మీడియా కవర్ చేస్తూనే ఉంది. ఈ చర్య పట్ల రైతు సంఘాలు ఒక్కసారిగా విస్మయానికి గురయ్యాయి.
ఎర్రకోటపై మతపరమైన జెండా - కారకులెవరు ?
ఢిల్లీలో తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయి. ముందే అనుకున్న మార్గం కాకుండా మరో మార్గంలో రైతులు వెళుతుండటంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సిద్ధు నేతృత్వం లోని ఆందోళనకారుల బృందం వారిపై దాడి చేసి.. ఎర్రకోటపై మతపరమైన జెండా ఎగురవేసింది. దీనిపై పలు అనుమానాలు తలెత్తాయి. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎర్రకోట మినహా మిగిలిన చోట్ల పోలీసులు నిర్బంధకాండకు పాల్పడ్డారు. అడుగడుగునా రైతులను అడ్డుకున్నారు. పలువురిపై లాఠీచార్జికి పాల్పడ్డారు. వారిని నిలువరించేందుకు బాష్పవాయు ప్రయోగాలు చేశారు. ఎర్రకోట వద్ద జరిగిన చర్యతో ఒకింత ఆశ్చర్యానికి గురైన సంయుక్త కిసాన్ మోర్చా.. ఇది అసాంఘిక శక్తుల చర్యగా పేర్కొంది. ఈ హింసాత్మక ఘటనలను ఖండిస్తూ..1న తలపెట్టిన పార్లమెంట్ మార్చ్‌ను నిలిపివేసింది. ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కేంద్రం సిద్ధుతో ఇటువంటి చర్యలకు పాల్పడిందని మోర్చా విమర్శించింది.
పోలీసుల చర్యపై పలు అనుమానాలు
దీప్ సిద్ధు ఓ బృందానికి నాయకత్వం వహిస్తూ... నడిపించిన తీరుపై పలు అనుమానాలు రేకెత్తక మానవు. అంత తేలికగా సిద్ధు, ఆయన అనుచర గణం ఎర్రకోట వద్దకు వెళ్లడంపై పోలీసుల తీరు అనుమానాస్పదమైంది. వారిని అడ్డుకోకుండా...ఎక్కడా నియంత్రించకుండా ..అనుకున్న లక్ష్యానికి చేరుకోవడానికి పోలీసులే సాయపడ్డారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ట్రాక్టర్ ర్యాలీని చేపట్టే ముందు రోజే ఎరక్రోటను లక్ష్యంగా చేసుకోవాలని సిద్ధు ఇచ్చిన పిలుపును పోలీసులు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదన్నదీ ఓ ప్రశ్నగా మారింది. ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడానికి కారణాలేంటి? ఇది ఇంటలిజెన్స్ వైఫల్యమా? లేదా ఇంకేమైనా ఉందా? అనుకున్న సమయానికంటే ముందు ఎందుకు అనుమతించారు? అనుకున్న మార్గం గుండా కాకుండా మరో మార్గం గుండా వెళుతున్న సిద్ధు బృందాన్ని ఆపకుండా...పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు వ్యవహరించారు? అదేవిధంగా సిద్ధూ ర్యాలీ సజావుగా ఎర్రకోట వరకు సాగడం వెనుక హస్తం ఎవరిది? ఇదంతా ఒక ఎత్తైతే ఎరక్రోటపై మతపరమైన జెండా ఎగురవేస్తున్న సమయంలో రక్షక భటులు అక్కడే ఉండి ఏం చేస్తున్నారు? కొన్ని గంటల పాటు ఆ జెండా ఎందుకు ఎగరనిచ్చారు? అదే సమయంలో రైతుల ట్రాక్టర్ ర్యాలీని చూసేందుకు వీలుండే ప్రాంతాల్లో ఇంటర్నెట్ ఎందుకు నిలుపుదల చేశారు? ఒక మాజీ పోలీసు అధికారిగా నాకు ఈ అనుమానాలు కలుగుతున్నాయి.
చారిత్రాత్మక కట్టడం వద్ద జరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ముందుగా అక్కడి నుండి ఆందోళనకారులను చెదరగొట్టడం, మతపరమైన జెండాను పీకేయడం వంటివి పోలీసులు చెయ్యవలసిన పనులు. కానీ వారెందుకలా చేయలేదు? ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారా? ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ తొలుస్తుంటే... కుట్ర కోణం ఉందన్న ఆరోపణకు బలం చేకూరుతున్నది. ఇదే అదునుగా తీసుకున్న మోడీ సర్కార్ రైతులపై.. బిజెపి యేతర రాష్ట్రాలపై తమ అక్కసును వెళ్లగక్కింది. ఉద్యమంలో సాగిన హింసాత్మక ఘటనల వెనుక ఉగ్రవాద చర్యలుగా పేర్కొంది. అదేవిధంగా మోడీ-కార్పొరేట్ అనుకూల మీడియా సైతం రైతులపై నెపం మోపుతూ కథనాలను వండి వార్చింది. అయితే కేంద్రం, ఎల్లో మీడియా ఆటలు ఎన్నో గంటలపాటు సాగలేదు. వెనువెంటనే సోషల్ మీడియా రూపంలో వాస్తవాలు వెలుగుచూశాయి. అయితే పోలీసులు దాడుల వెనుక ఉన్న వారిపై కాకుండా... అమాయకులైన రైతులపై కేసులు బనాయిస్తున్నారు. దీంతో పోలీసులపై మరింతగా విమర్శలు మొదలయ్యాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో హింసకు తావు లేదు. ఢిల్లీ లోని పలు ప్రాంతాల్లో జరిగిన దాడుల వెనుక ఉన్న అసలైన కుట్రదారులను వెలికి తీసి కఠినంగా శిక్షించాలి. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపడితే ఈ అనుమానాలు రూపుమాపుకునే అవకాశం పోలీసు శాఖకు లభించినట్లే.
బడా కార్పొరేట్లకు వ్యతిరేకంగా రైతులు సుదీర్ఘ పోరాటం సాగిస్తున్నారు. సమకాలీన ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి పోరాటాలు విజయవంతమైన ఆనవాళ్లు లేవు. బ్యాంకుల నుండి భారీ మొత్తాలను కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రభుత్వాలు మద్దతు ధర లేదా ఇతర రూపాల్లో రైతులకు మాత్రం సహాయం చేయడానికి సిద్ధపడవు. ఈ పోరాటంలో విజయం సాధిస్తే భారతీయ రైతులు చరిత్ర సృష్టించడమేగాక ప్రపంచ వ్యాప్తంగా జరిగే ఇలాంటి ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చిన వారవుతారు.
వ్యాసకర్త సిక్కిం మాజీ డిజిపి
('ది వైర్' సౌజన్యంతో)
అవినాష్ మొహనాని










