Sep 01,2023 23:07
రైతులకు చెక్కును అందజేస్తున్న జిల్లా కలెక్టరు రంజిత్‌ బాషా, ప్రజాప్రతినిధులు

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని కలెక్టర్‌ పి రంజిత్‌బాషా తెలిపారు. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా- పీఎం కిసాన్‌ ఐదో ఏడాది తొలి విడత పెట్టుబడి నిధి, మే నుంచి ఆగస్టు నెల వరకు కురిసిన అధిక వర్షాలకు నష్టపోయిన పంటలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీ కార్యక్రమా న్ని తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌ విధానంలో బటన్‌ నొక్కి ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని రైతులకు స్థానిక స్పందన సమావేశ మందిరంలో కలెక్టరు పి రంజిత్‌ బాషా, బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి, శాసనమండలి సభ్యులు పోతుల సునీత ద్వారా శుక్రవారం నగదు పంపిణీ చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఆగస్టు మాసంలో వర్షాలు తక్కువగా ఉన్నందున నీటి వినియోగంలో అశ్రద్ధ వహించవద్దని రైతులకు సూచించారు. సెప్టెంబరు మాసంలో వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ ప్రకటించినట్లు చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయ సలహామండలి ఛైర్మన్‌ మంతెన దశరథమహారాజు, వ్యవసాయ శాఖ అధికారి షేక్‌ అబ్దుల్‌ సత్తార్‌, ఉద్యనవన శాఖ ఏడి జెన్నెమ్మ, ఏపిఎంఐపి పీడీ పివి రమణ, రైతులు పాల్గొన్నారు.