ప్రజాశక్తి-సామర్లకోట రూరల్ రాష్ట్ర ప్రభుత్వం అనేక వ్యయ ప్రయాసలకోర్చి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఉమ్మడి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ ఆకుల వీర్రాజు, రాష్ట్ర హౌసింగు బోర్డు చైర్మన్, పెద్దాపురం నియోజకవర్గం వైసిపి ఇన్‌ఛార్జి దవులూరి దొరబాబు పేర్కొన్నారు. సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవంలో రూ.13 లక్షల వ్యయంతో నిర్మించిన రైతుల కమర్షియల్ సొసైటీ భవనాన్ని ఆదివారం డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా హసింగ్ చైర్మన్ దొరబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. సిఎం వైఎస్ జగన్ రైతు పక్షపాతి అన్నారు. రైతుల సంక్షేమానికి చేస్తున్న కృషిని, ఇస్తున్న పథకాలను వివరించారు. మొదట కమర్షియల్ భవనం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రిబ్బన్ కత్తిరించి భవనాన్ని ఆకుల, దవులూరి ప్రారంభించారు. అనంతరం డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన దుకాణంలో దవులూరి దొరబాబు చీరలు కొనుగోలు చేసి 43 మంది మహిళా వాలంటీర్లకు బహూకరించారు. తొలుత గ్రామానికి వచ్చిచన డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు, హౌసింగు చైర్మన్ దవులూరి దొరబాబులకు సీనియర్ వైసీపీ నాయకులు, ఎంపిటీసీ మలకల సూర్యారావు (సూరిబాబు) ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి బొబ్బరాడ సత్తిబాబు, గ్రామ సర్పంచ్ నీలపాల సత్యనారాయణ, ఎంపిటిసి మలకల సూర్యారావు (సూరిబాబు), సొసైటీ అధ్యక్షుడు మలకల వరాలబాబు, పలువురు సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.










