Jul 14,2023 23:25

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి కాకినాడ జెడ్‌పి కార్యాలయ సమావేశ హాలులో శుక్రవారం జెడ్‌పి చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాల్‌ అధ్యక్షతన జరిగిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో రైతుల సమస్యలపై సభ్యులు అధికారులను నిలదీశారు. జెడ్‌పి సమావేశం అని పెట్టి రైతుల సమస్యలపై శ్రద్ధ చూపడం లేదని పిడిఎఫ్‌ ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు అన్నారు. ఉమ్మడి జిల్లా అని చెప్పి కేవలం కాకినాడ జిల్లాకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే నివేదికలో పొందుపర్చారన్నారు. కౌలు రైతులకు ఇచ్చే గుర్తింపు కార్డుల లెక్కల వివరాలు కూడా సమగ్రంగా ఇవ్వలేదన్నారు. జూన్‌ ఒకటనే కాలువల ద్వారా నీటిని విడుదల చేసినట్లు అధికారులు చెబుతున్నా నేటికీ అనేక చోట్ల నారుమళ్లు కూడా సిద్ధం చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. గతేడాది కూడా ఇదే మాట చెప్పినప్పటికీ సకాలంలో నీటి విడుదల లేకపోవడంతో అపరాల సాగు జరగలేదన్నారు. సమావేశాల్లో అధికారులు చెబుతున్న అంశాలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన లేదన్నారు. చిరుధాన్యాల సాగుపై మాటల్లో తప్ప ఆచరణలో శ్రద్ధ కనబరచడం లేదన్నారు. ఈ సందర్భంగా 31 అంశాలను పొందుపరచగా వ్యవసాయ, ఇరిగేషన్‌, వైద్య, ఆరోగ్య, గృహ నిర్మాణ సంస్థ, ఆర్‌ అండ్‌ బి, విద్యా, ఉపాది హామీ తదితర 8 అంశాలను మాత్రమే సమావేశంలో చర్చించి మమ అనిపించారు. పిఆర్‌ ఇంజనీరింగ్‌ శాఖపై మొక్కుబడిగా కానిచ్చారు. విద్యుత్‌ శాఖపై చర్చ సందర్భంగా పలువురు సభ్యులు అప్రకటిత కరెంటు కోతలపై ధ్వజమెత్తారు. అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
కౌలు రైతుల చట్టం ప్రకారం భూ యజమాని సంతకం ఉంటేనే సిసిఆర్‌ కార్డు జారీ చేస్తుండడం వల్ల వాస్తవ సాగుదారుడికి తీవ్ర నష్టం జరుగుతుందని, పలువురు రైతులు అప్పుల పాలవుతున్నారని సమావేశంలో కొందరు జెడ్‌పిటిసి ఆవేదన వ్యక్తం చేశారు. తారతమ్యం లేకుండా పూర్తిస్థాయిలో అందరికీ సిసిఆర్‌ కార్డులు జారీ చేయాలని జగ్గంపేట ఎంఎల్‌ఎ జ్యోతుల చంటి బాబు కోరారు. వాస్తవ సాగుదారుడికి ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో విఆర్వో, వ్యవసాయ శాఖ అధికారుల సంతకాలతో ఐదేళ్లు కౌలుకు సాగు చేస్తున్న రైతులకు డిసిసిబి ద్వారా రుణాలు ఇచ్చే ప్రక్రియను కొత్తపేట నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా చేపట్టినట్లు కొత్తపేట ఎంఎల్‌ఎ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఎంఎల్‌సి కుడిపూడి సూర్యనారాయణ మాట్లాడుతూ కాలువల మరమ్మతులు చేపట్టాలన్నారు. కాలువలకు నీరు విడుదల చేసినా శివారు ప్రాంతాలకు అందడం లేదని అయినవిల్లి, రాజోలు, గండేపల్లి, రాజవొమ్మంగి, కె.గంగవరం, సామర్లకోట తదితర ప్రాంతాలకు చెందిన జెడ్పిటిసిలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
వాలంటీర్లకు భరోసా కల్పిస్తూ తీర్మానం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తెచ్చిన విప్లవాత్మక వ్యవస్థ వాలంటీర్లపై కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ వారికి పూర్తిభరోసా కల్పిస్తున్నట్లు బిసి సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు శాఖల మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. వాలంటీర్లకు మేమున్నామంటూ భరోసా కల్పించేలా, ఈ వ్యవస్థను తీసుకొచ్చిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపేలా తీర్మానం చేయాలంటూ ఎంఎల్‌ఎ కురసాల కన్నబాబు కోరారు. దీనిపై అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు కాకినాడ కలెక్టర్‌ కృతికా శుక్లా, అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తెలిపారు. మంత్రి దాడిశెట్టి రాజా, కాకినాడ ఎంపీ వంగా గీత, కాకినాడ రూరల్‌ ఎంఎల్‌ఎ కురసాల కన్నబాబు, జెడ్‌పి వైస్‌ చైర్మన్‌ బుర్ర అనుబాబు పాల్గొని మాట్లాడారు.