Nov 08,2023 21:44

రైతులతో మాట్లాడుతున్న ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి లక్ష్మునాయుడు

ప్రజాశక్తి-సీతానగరం : ఈ నెల పదో తేదిన కలెక్టరేట్‌ వద్ద చేపట్టే రైతుల ధర్నాను విజయవంతం చేయాలని ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి లక్ష్మునాయుడు తెలిపారు. ఈ మేరకు ధర్నాను విజయవంతం చేయాలని మండలంలోని ఏగోటి వలస, గాదెలవలస, జానుములవలస, లక్ష్మీపురం, బూర్జ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ సర్వేలో చాలా తప్పులున్నాయని తెలిపారు. రెవెన్యూ అధికారులు, సంబంధిత సర్వే సిబ్బంది మొక్కుబడి చేపట్టిన సర్వేలో వాస్తవ సాగుదారు ఒకరైతే, పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల్లో వేరే వారి పేర్లు నమోదు చేశారని తెలిపారు. భవిష్యత్తులో రైతులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. తక్షణమే రీసర్వే చేసి తప్పులు సరిదిద్దాలని డిమాండ్‌ చేశారు. వర్షాలు లేక జిల్లాలో వరి చాలావరకు ఎండిపోయిందని, ప్రభుత్వం ఇంతవరకు కరువు ప్రాంతాలను ప్రకటించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కరువు ప్రకటించకపోతే రైతులకు నష్ట పరిహారం రాదని ఆందోళన వ్యక్తంచేశారు. తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఎన్‌సిఎస్‌ చక్కెర ఫ్యాక్టరీ మూత పడిన కారణంగా ఈ ప్రాంత రైతులు పండించిన చెరకు పంటను సంకిలి కర్మాగారానికి తరలిస్తున్నారని తెలిపారు. అలాంటి రైతులకు రవాణా ఛార్జీలు కర్మాగార యాజమాన్యం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎపి రైతు సంఘం మండల నాయకులు బి.అప్పారావు, జి.వెంకటరమణ పాల్గొన్నారు.