ప్రజాశక్తి-పాడేరు టౌన్: ఏజెన్సీలో ఉత్పత్తి చేస్తున్న పసుపు పంటను ట్రేడర్లు నేరుగా గిరిజన రైతుల నుండి కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేసారు. గిరిజన రైతులకు గిట్టుబాటు ధర అందించాలన్నారు. దళారులతో గిరిజన రైతులకు నష్టం వాటిల్లుతుందని చెప్పారు. కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో ఉద్యానవన శాఖ, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులు, పసుపు ట్రేడర్లతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పసుపు కొనుగోలులో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా గిరిజన రైతుల నుండి కొనుగోలు చేస్తే మంచి ధర అందించడానికి అవకాశం ఉంటుందన్నారు. గిరిజన రైతులు సాగు చేస్తున్న పసుపునకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉందన్నారు. వారపు సంతలలో పసుపు కొనుగోలు చేయడానికి ప్రత్యేక ఏరాట్లు చేస్తామని తెలిపారు. మధ్యవర్తులతో గిరిజన రైతులు నష్టపోతున్నారని, వీరికి విక్రయించకుండా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ట్రేడర్లకు అవసరమైన మంచి నాణ్యత, తగినన్ని నిల్వలు సమకూరుస్తామని చెప్పారు. ట్రేడర్లకు ఎంత మేరకు సరుకు కొనుగోలు చేస్తారో తెలియజేస్తే ఆ మేరకు ఏర్పాటు చేస్తామన్నారు. వ్యవసాయ, ఉద్యాన వన శాఖల నుండి ట్రేడర్లకు పూర్తి సహాయ సహకారలు అందిస్తామని చెప్పారు. పెదబయలు, జి.మాడుగుల, హుకుంపేట మండలాల్లో రైతులు అత్యధికంగా పసుపు సాగు చేస్తున్నారని చెప్పారు. పసుపు ఉడికించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పసుపు కొమ్ములు ఎలా ఉండాలి, ఎంత మేరకు తేమ ఉండాలి అనే అంశములపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. పసుపు నాణ్యత పరీక్షా ల్యాబ్‌ను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉద్యానవన అధికారి రమేష్ కుమార్‌రావు, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు శ్రీనివాస్, మార్కెటింగ్ సహాయ సంచాలకులు రాకేష్, పలువురు పసుపు ట్రేడర్లు పాల్గొన్నారు.










