Jun 22,2023 01:06

ప్రజాశక్తి-కాకినాడ సిసిఆర్‌సి కౌలు రైతు కార్డుతో సంబంధం లేకుండా చనిపోయిన కౌలు రైతులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని కోరుతూ ఎపి కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో జెసి ఇలాక్కియాకు బుధవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.రాజశేఖర్‌, వల్లు రాజబాబు మాట్లాడుతూ అన్ని పంటలూ పుష్కలంగా పండే కాకినాడ జిల్లాలో నెల రోజుల్లో నలుగురు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ప్రకతి నష్టాలు, పెరిగిన ఎరువులు, పురుగు మందుల ధరలు, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం, కౌలు రైతులకు గుర్తింపు కార్డు లేక ప్రభుత్వ పరిహారాలు సాగు చేయని భూ యజమానులకు అందడం దీనికి కారణం అన్నారు.కాజులూరు మండలం దుగ్గుదూరు గ్రామంలో జోడ చిట్టిబాబు, చేదువాడ గ్రామంలో గుండుపల్లి ఆంజనేయులు, తాళ్ళరేవు మండలం చొల్లంగి గ్రామంలో బొడ్డు గంగాధర్‌ రావు, కరప మండలం యండమూరు గ్రామంలో వనం త్రిమూర్తులు కుటుంబాలకు కౌలు కార్డు లేక పరిహారం ఇవ్వడం లేదన్నారు. ఈ విషయమై చనిపోయిన కౌలు రైతుల భార్యలు కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు. ఈ విషయమై స్పందించిన జాయింట్‌ కలెక్టర్‌ కార్డు ఉన్నా లేకపోయినా కౌలు రైతు అప్పుల కోసం ఆత్మహత్య చేసుకుంటే విచారణ జరిపి పరిహారం అందజేస్తామని అన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ కలిసిన వారిలో ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, అలాగే చనిపోయిన కౌలు రైతుల భార్యలు జోడ ప్రశాంతి, వనం లక్ష్మి, బొడ్డు లక్ష్మి, గండుపల్లి దుర్గ పాల్గొన్నారు.