
ప్రజాశక్తి - కనగానపల్లి : రాష్ట్రంలో విద్యుత్ సరఫరా సరిగా లేక పంటలన్నీ నిలువునా ఎండిపోతున్నాయని రైతుల కష్టాలను పట్టించుకోకుండా ప్రతిపక్షాలను వేధించడమే సిఎం పనిగా పెట్టుకున్నారనిమాజీ మంత్రి పరిటాల సునీత విమర్శించారు. మండలంలోని తగరకుంట, నరసంపల్లి తదితర గ్రామాల్లో విద్యుత్ కొరతతో ఎండుతున్న వేరుశనగ, వరి, టొమాటో, చీనీ పంటలను ఆమె మంగళవారం పరిశీలించారు. అక్కడ రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. తగరకుంట గ్రామంలో వడ్డిపల్లి రామకృష్ణ అనే రైతు 4.50 ఎకరాలలో ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి వేరుశనగ సాగు చేశాడు. విద్యుత్ కోతల వల్ల వేరుశనగ పంట మొత్తం వాడిపోయి ఎండిపోయే దశలో ఉంది. కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రాని పరిస్థితి ఉందని పరిటాల సునీత ఈసందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డుపల్లి ఎర్రిస్వామి అనే రైతు 3ఎకరాలలో లక్ష రూపాయల పెట్టుబడి పెట్టి వరి, వేరుశెనగ సాగు చేశాడు. వరి పంట వెన్ను వేసే దశలో ఉందని.. ప్రస్తుతం వరి, వేరుశనగ రెండు పంటలు ఎండిపోతున్నాయని బాధిత రైతు పరిటాల సునీత వద్ద వాపోయాడు. రైతుల సమస్యలు తెలుసుకున్న అనంతరం సునీత మాట్లాడుతూ న్నికల ముందు 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామనిజగన్ రెడ్డి ప్రగల్బాలు పలికారని.. కానీ ఇప్పుడు కనీసం నాలుగు గంటలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు. రైతులకు సాయం అందించాల్సింది పోయి విద్యుత్ సరఫరా సరిగా చేయకపోతే రైతులు ఎలా పంటలు పండిస్తారని ప్రశ్నించారు. ఇలాంటి అసమర్ధ ముఖ్యమంత్రి వల్ల రైతులు పంటలు కోల్పోవాల్సి వస్తుందని అన్నారు. ఇప్పటికైనా 9 గంటల ఉచిత విద్యుత్ అందించకపోతే రైతుల పక్షాన తెలుగుదేశం పార్టీ పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ యాతం పోతలయ్య, సర్పంచులు మాధవరాజు, సోమర చంద్ర శేఖర్, నాయకులు సుధాకర్ చౌదరి, రంగయ్య, బోదుల రామాంజి, రాజకష్ణ, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.