
గుంటూరు, పల్నాడు జిల్లాల్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల వల్ల ఈఏడాది రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అయినా అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, మంత్రులు క్షేత్ర స్థాయికి వెళ్లి రైతుల సమస్యలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. పొలాల్లో వాస్తవ పరిస్థితి ఎలా ఉంది? ఏ ప్రాంతానికి నీరు రావడం లేదు? ఎక్కడ ఏ పంట ఎండిపోతోంది? తక్షణం నీటి అవసరం ఎవరికి ఉందన్న అంశాలపై అధికార యంత్రాంగం కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం లేదు. డెల్టాలో కాల్వలకు నీరు విడుదల చేస్తున్నా నీరు చివరి భూములకు వెళ్లని పరిస్థితి నెలకొంది. ఎక్కడో బాపట్ల, వేమూరు నియోజకవర్గాల్లోని చివరి గ్రామాలకు కాకుండా కాల్వలకు సమీపంలో ఉన్న తెనాలి మండలంలో హాఫ్‌పేట, ఖాజీపేట గ్రామాల్లో పంట ఎండిపోయి ఎందుకు పనికి రాకుండా పోయింది.
కాల్వల నిర్వహణా లోపం వల్ల ఈ ఏడాది డెల్టాలోని వరిపైరుకు నీరు ఇచ్చినా కాల్వలకు చేరని పరిస్థితి నెలకొంది. సకాలంలో మరమ్మతుల చేపట్టకపోవడం వల్ల ఈ దుస్థితి ఏర్పడిందని తెనాలి ప్రాంత రైతులు వాపోతున్నారు. తెనాలి మండలం హాఫ్‌పేటలో తుంగభద్ర డ్రెయిన్‌లో మురుగునీటిని మళ్లించి సాగునీరు తెచ్చుకోవడానికి రైతులు భగీరథ ప్రయత్నం చేశారు. కిలో మీటరు దూరం పైపులు వేసుకుని పొలాలకు నీరు తెచ్చుకోవడం రైతులకు ఎంతో వ్యయ ప్రయాసలతో కూడిన అంశంగా మారింది. డెల్టాలో వరి బెట్టకు రావడంతో పంటను కాపాడుకునేందుకు రైతులు రేయింబవళ్లు కష్టపడుతున్నారు. ఇందువల్ల ఒక్కొ రైతుకు ఎకరాకు రూ.5 వేల నుంచిరూ.8 వేల వరకు అదనంగా ఖర్చుచేస్తున్నారు. చేబ్రోలు, కొల్లిపుర, పెదకాకాని మండలాల్లోని పలు గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు పల్నాడు జిల్లాలో మిర్చిపంటలను కాపాడుకునేందుకు రైతులు నానా కష్టాలు పడుతున్నారు. మెట్ట ప్రాంతంలో మిర్చి, పత్తి, ఇతర పంటలు ఎండుముఖం పట్టడంతో ట్రాక్టర్ల ద్వారా నీటిని తెచ్చి పొలాలను తడుపుకొంటున్నారు. అక్టోబరులో తాగునీటి అవసరాల పేరుతో సాగర్ కాల్వలకు ఐదు టిఎంసీల నీరు విడుదల చేశారు. సాగుకు ఇవ్వలేదు. అక్టోబరు నెల మొత్తం వర్షం లేకపోవడం వల్ల తీవ్ర వర్షాభావంతో పంటలు ఎండిపోతుండటంతో కడవలతో నీరు తెచ్చి వాటిని బతికించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రైతులు ఇంతగా ఇబ్బంది పడుతున్నా వారిని పలకరించిన నాథుడు లేరు. స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులు కూడా చాలా మంది పొలాల దరిదాపులకు రావడం లేదు. అధికార పార్టీ నాయకులంతా సామాజిక బస్సు యాత్రల బిజీలో నిమగం అయ్యారు. డెల్టాలో ఉన్న మంత్రి మేరుగ నాగార్జున, పల్నాడు జిల్లాలోని మంత్రులు విడదల రజనీ, అంబటి రాంబాబు ఒక్క రోజు కూడా కాల్వల పరిస్థితిపై పరిశీలన చేయలేకపోయారు. నిత్యం రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలకే పరిమితమైన మంత్రి అంబటి డెల్టా,సాగర్ ఆయకట్టుపై మాత్రం దృష్టి సారించడం లేదనేవిమర్శలు వచ్చాయి. ఎమ్మెల్యేలు, ఎంపిల వద్దకు వచ్చిన వైసిపి నాయకులు నీటి ఎద్దడి సమస్యలను ప్రస్తావించినా మొక్కుబడి అధికారులకు ఫోన్లుచేసి ఆయా ప్రాంతాలకునీటి విడుదలపై ఆదేశాలు ఇస్తున్నారు. అంతేతప్ప రైతులను ధైర్యం చెప్పి నీరు పొలాలకు చేరేందుకు తగిన భరోసా ఇచ్చిన నాయకులు లేరన్న విమర్శలు సరత్రా విన్పిస్తున్నాయి.
(ఎ.వి.డి.శర్మ)